Clock Of Nellore ( Nellore ) – తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాపూరు మాజీ ఎమ్మెల్యే యల్లసిరి శ్రీనివాసులు రెడ్డి సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం నెల్లూరులోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టిడిపి జాతీయ కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరుజిల్లా టిడిపి అధ్యక్ష, కార్యదర్శులు అబ్ధుల్ అజీజ్, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, ఆత్మకూరు టిడిపి ఇంఛార్జ్ కన్నబాబు తదితరులు సంతాపం తెలియజేశారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం స్వస్థలమైన గూడూరులోని చెన్నూరులో జరగనున్నాయి.
1983 లో ఎన్టీఆర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన యల్లసిరి శ్రీనివాసులు రెడ్డి… నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి అనుచరునిగా కొనసాగారు. 1981లో గూడూరు సమితి అధ్యక్షునిగా పనిచేశారు. 1984 లో జిల్లా పరిషత్ ఛైర్మైన్ గా, 1994లో రాపూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరుజిల్లా అధ్యక్షునిగా కూడా రెండు దఫాలు సేవలు అందించారు. తర్వాత కాలంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత నుండి రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు.