Clock Of Nellore ( Kakupalli ) – తమ పార్టీకి చెందిన కార్యకర్తలను బెదిరిస్తే అదే రీతిలో గట్టిగా సమాధానమిస్తామని నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్ అధికార పార్టీ ఎమ్మెల్యేలను హెచ్చరించారు. పార్టీ అండగా ఉంటుందని కార్యకర్తలు ఎవ్వరూ భయపడవద్దని భరోసా ఇచ్చారు. నెల్లూరు రూరల్ మండలం, కాకుపల్లిలో నిర్వహించిన ఆత్మ గౌరవ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నేత బద్దెపూడి రమేష్ తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం అజీజ్ మాట్లాడుతూ నెల్లూరు రూరల్ లో ప్రజలు స్వేచ్ఛగా బ్రతకాలని అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ పార్టీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే బెదిరింపులకు ఎవ్వరూ భయపడవద్దని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని గ్రామాల్లో వైసీపి ఎమ్మెల్యేలు ప్రజలకు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. రూరల్ గ్రామాల్లో రోడ్లు ప్రమాదకరంగా, గుంతల మయంగా మారిపోయి ఉన్నాయని, కనీసం రోడ్లపై తిరిగే పరిస్థితి లేకున్నా రూరల్ ఎమ్మెల్యే రోడ్లపై కన్నెత్తి కూడా చూడటం లేదని ఆరోపించారు. సిఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో శ్రీనివాసులు నాయుడు, పెంచల నాయుడు, జలదంకి సుధాకర్, కనపర్తి గంగాధర్, అబీద సుల్తానా, పద్మ, రేవతి తదితరులు పాల్గొన్నారు.
