Clock Of Nellore ( Nellore ) – నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని కోరుతూ యువజన, విద్యార్ధి సంఘాలు గురువారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడిని పోలీసులు భగ్నం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు తెలుగు యువత జిల్లా అధ్యక్షులు కాకర్ల తిరుమల నాయడు. నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి పోలీసులు వ్యవహరించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సంఘ విద్రోహక శక్తుల మాదిరి విద్యార్ధులను చుట్టుముట్టి, వెంటాడి అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. ఉద్యోగాలు కోరితే కేసులు మోపడం ఏంటని మండిపడ్డారు. కలెక్టరేట్ కు వెళ్లేందుకు తాము టిడిపి కార్యాలయం వద్ద ఉంటే అక్కడకు వచ్చీ మరీ తమను అరెస్ట్ చేశారని, నిరుద్యోగుల ఉద్యమాలను అడ్డుకోలేదని స్పష్టం చేశారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు రెండేళ్లు పెంచితే నిరుద్యోగుల పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగు యువత నేతలు ప్రవీణ్, మోపూరు సాయికిరణ్, హజరత్ కుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.