Clock Of Nellore ( Atmakur ) – తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని మనస్థాపానికి గురైన ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు కాపాడిన సంఘటన నెల్లూరుజిల్లాలో చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలం, అశ్వినీపురం గ్రామానికి చెందిన మైనర్ బాలికకు తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయించారు. అయితే ఆ పెళ్లి బాలికకు ఇష్టం లేకపోవడంతో తాను ఆత్మహత్య చేసుకుంటానని దిశ యాప్ ద్వారా పోలీసులకు తెలియజేసింది. ఫోన్ వచ్చిన 7 నిముషాల వ్యవధిలో ఇంటికి చేరుకున్న ఆత్మకూరు ఎస్సై శివ శంకర్ రావు వారి సిబ్బంది బాలికతో మాట్లాడారు. బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పెళ్లిని వాయిదా వేయించారు. మైనార్టీ తీరక ముందు వివాహం చేయడం నేరమని, మేజర్ అయిన తర్వాతే పెళ్లి చేయాలని వారితో చెప్పగా వారు అంగీకరించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు ఎస్సై శివ శంకర్ రావు మాట్లాడుతూ దిశ యాప్ ను ప్రతీ ఒక్కరూ తమ సెల్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఏ సమస్య ఉన్నా ఆ యాప్ ద్వారా పోలీసులకు తెలియజేయాలని కోరారు.