Clock Of Nellore ( Kuwait ) – ఆంధ్రప్రదేశ్ లో నూతన జిల్లాల ఏర్పాటు కొన్ని చోట్ల వివాదాలకు దారి తీస్తుంది. ఆ జిల్లాలో మా ప్రాంతం వద్దని కొందరు అంటుంటే అదే జిల్లాలో తమ ప్రాంతాన్ని కొనసాగించాలని నిరసనలు తెలియజేస్తున్నారు. మరి కొన్ని చోట్ల జిల్లా కేంద్రాల ఏర్పాటుపై ప్రజల నుండి అభ్యంతాలు వ్యక్తమవుతున్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి భాలకృష్ణ ఏకంగా ధర్నా చేపట్టి హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి నిరసనలు కొనసాగుతుండగా తాజాగా ఆ నిరసనలు విదేశాలకు కూడా పాకాయి. విదేశాల్లో స్థిరపడ్డ ప్రవాసాంధ్రులు కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన అన్నమయ్య జిల్లాకు రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడంపై ప్రవాసాంధ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కువైట్ లో స్థిరపడ్డ రాజంపేట, రైల్వే కోడూరు వాసులు పార్టీలకు అతీతంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని జిల్లా కేంద్రం ఏర్పాటుపై తమ నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమిటి కన్వీనర్ ముమ్మిడి బాలిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వారు రాయచోటి కాకుండా జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజంపేట జిల్లా సాధన సమితి పేరుతో పార్టీలు, మతాలు, వర్గాలకు అతీతంగా జేఏసిగా ఏర్పడి కువైట్ లోని రిగై ప్రాంతంలో ఉన్న రాయల్ ఫార్మసీ భవనంలో సమావేశాన్ని నిర్వహించారు. అన్నమయ్య జిల్లాకు రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించేవరకూ తమ ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమ వివరాలను వైసీపి గల్ఫ్ దేశాల మీడియా కో – ఆర్డినేటర్ షేక్ గౌస్ బాషా తెలియజేశారు.