పరిశ్రమల్లో 75 % ఉద్యోగాలు స్థానికులకే : వాటర్ బేస్ ప్రారంభోత్సవంలో మంత్రి కాకాణి

Clock Of Nellore ( TP Gudur ) – జిల్లాలో విరివిగా ఏర్పాటవుతున్న పరిశ్రమల ద్వారా స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తోటపల్లిగూడూరు మండలం, అనంతవరం గ్రామంలోని వాటర్ బేస్ ప్లాంట్ లో ఆధునీకరించిన రొయ్యల ప్రాసెసింగ్ కేంద్రాన్ని సిఈవో రమాకాంత్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ వాటర్ బేస్ కంపెనీకి ఎంతో ఘన చరిత్ర ఉందని, అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించిన ఈ కంపెనీ… అనంతవరంలో ప్రాసెసింగ్ యూనిట్ ను ఆధునీకరించి తిరిగి ప్రారంభించడం శుభపరిణామమన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు ఆర్థిక పరిపుష్టి సాధిస్తాయని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి హయాంలో జిల్లాలో అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. కృష్ణపట్నం పోర్టు, ధర్మల్ విద్యుత్ కేంద్రాలు, శ్రీ సిటీ, ఇఫ్కో కిసాన్ సెజ్, అపాచీ వంటి ఎన్నో పరిశ్రమలను నెలకొల్పి పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేసిన ఘనత రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, స్థానికంగా ఉన్న యువతకు ఈ పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు దక్కేలా అసెంబ్లీలో తీర్మానించారన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు కూడా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు స్థానిక నాయకులను సమన్వయం చేసుకుని సమీప గ్రామాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ వాటర్ బేస్ కంపెనీ తన కార్యకలాపాలను మరింత విస్తరింప చేసి స్థానిక యువతకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం రొయ్యల ప్రాసెసింగ్ కేంద్రాన్ని సందర్శించి, రొయ్యలను ప్రాసెసింగ్ చేసి ప్యాకింగ్ చేసే విధానాన్ని మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వాటర్ బేస్ కంపెనీ లిమిటెడ్ సీఈవో రమాకాంత్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవి పళనిస్వామి, కార్పొరేట్ హెచ్ఆర్ హెడ్ శ్రీరామమూర్తి, ప్రాసెసింగ్ హెడ్ షాజీ, టిపి గూడూరు ఎంపీడీవో హేమలత, తహసిల్దార్ శ్యామలమ్మ, ఎంపీపీ స్వర్ణలత, జెడ్పిటిసి శేషమ్మ, సర్పంచ్ రమేష్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, వాటర్ బేస్ కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు.

Read Previous

కార్పొరేషన్ కార్యాలయంలో వైఎస్ వర్ధంతి – పాల్గొన్న మేయర్, డిప్యూటీ మేయర్

Read Next

నగరంలో కమిషనర్ హరిత విస్త్రృత పర్యటన…

Leave a Reply

Your email address will not be published.