Clock Of Nellore ( Nellore ) – దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద విద్యార్ధుల కోసం ప్రవేశపెట్టిన ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పథకాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలగించి ఎంతో మంది పేద విద్యార్ధులకు ఉన్నత విద్యను దూరం చేశారని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఆయన 18వ రోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. 3వ మైలు, నవలాకులతోట ప్రాంతాల్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పథకం తొలగించడం వల్ల తమ పిల్లలు ఉన్నత విద్య చదువుకోలేక పోతున్నారని కేతంరెడ్డి వద్ద వాపోయారు. దీనిపై స్పందించిన వినోద్ రెడ్డి… వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పథకాన్ని మొదలు పెట్టారని, తర్వాత చంద్రబాబు నాయుడు దాన్ని కొనసాగించారని గుర్తు చేశారు.

అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక, రీ ఎంబర్స్ మెంట్ పథకాన్ని పూర్తిగా తొలగించి దాని స్థానంలో జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. విద్యా దీవెన పథకానికి వంద మెలికలు పెట్టడంతో ఎంతో మంది పేద విద్యార్ధులకు ఆ పథకం వర్తించక నష్టపోతున్నారన్నారు. ఓ కుటుంబం అప్పులు చేేసి సొంత ఇల్లు కల్లుకుంటే సొంత ఇల్లు ఉందనే కారణంతో ఆ ఇంట్లో విద్యార్ధికి విద్యా దీవెనను తొలగించారని చెప్పారు. ఇదెక్కడి పథకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను ఆశీర్వదించాలని, జనసేన ప్రభుత్వం ఏర్పడితే ఇలాంటి దుర్మార్గ చర్యలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి కేజీ నుండి పీజి వరకూ ఉచిత విద్య అందిస్తామని కేతంరెడ్డి హామీ ఇచ్చారు.
