Clock Of Nellore ( Nellore ) – ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చక్రధర్ బాబు వెల్లడించారు. గురువారం నెల్లూరులోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న తిక్కన భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా 3 పార్లమెంటు, 7అసెంబ్లీ నియోజక వర్గాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీచేయడం జరిగిందని, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 115 – ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీచేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉప ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన 25వ తేది నుండి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి రావడం జరిగిందని, వచ్చే నెల జూన్ 28వ తేదీ వరకు అమలులో వుంటుందని కలెక్టర్ తెలిపారు.

ఎన్నికల నియమావళి కి అనుగుణంగా, కేంద్ర ఎన్నిక సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఆత్మకూరు నియోజక వర్గ ఉప ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు బెల్ ఇంజినీర్ల సహకారంతో అవసరమైన బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వివి ప్యాట్స్ సిద్దం చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. ఆత్మకూరు నియోజక వర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 30వ తేదీన రిటర్నింగ్ అధికారిచే గజెట్ నోటిఫికేషన్ జారి చేయబడుతుందని, వచ్చే నెల జూన్ 6వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, జూన్ 7వ తేదీన నామినేషన్ల పరిశీలన, జూన్ 9వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణ, జూన్ 23వ తేదీన పోలింగ్, జూన్ 26వ తేదీన ఓట్ల లెక్కింపు వుంటుందని కలెక్టర్ తెలిపారు.

ఆత్మకూరు నియోజక వర్గ ఉప ఎన్నికకు సంబంధించి మొత్తం 2,13,330 మంది ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అందులో 1,05,924 మంది పురుష ఓటర్స్, 1,07,733 మంది మహిళా ఓటర్స్, 11 మంది థర్డ్ జండర్స్ ఓటర్స్ , 62 మంది సర్వీసు ఓటర్స్ వున్నారని కలెక్టర్ వివరించారు. నియోజక వర్గంలో 279 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 1,000 ఓట్లు పైబడి ఓట్లు కలిగిన పోలింగ్ కేంద్రాల పరిధిలో అదనంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. 2022, జనవరి 1వ తేదీని ప్రామాణికంగా తీసుకొని ఓటర్ల జాబితాను సిద్దం చేయడం జరిగిందని, ఈ ఓటర్ల జాబితాను అభ్యర్దులకు, పోలింగ్ ఏజెంట్స్ కు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. ఈ ఉప ఎన్నికకు సంబంధించి 648 బ్యాలెట్ యూనిట్స్ ను, 593 కంట్రోల్ యూనిట్స్ ను, 583 వివి ప్యాట్స్ ను వినియోగించడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. నియోజక వర్గ పరిధిలో ఏ ఓటర్ ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలో తెలిసేలా ఓటర్ల స్లిప్ లను ఓటర్లకు అందచేయడం జరుగుతుందని, అలాగే ఇప్పటికే ఎపిక్ కార్డును ఓటర్స్ కు జారి చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఓటర్ ఎఫిక్ కార్డు తో పాటు ఆధార్ కార్డు, బ్యాంకు, పోస్ట్ ఆఫీసు పాస్ బుక్, డ్రైవింగ్ లెసెన్స్, పాన్ కార్డు, ఎన్.ఆర్.ఈ. జి.ఏ కార్డు, పాస్ పోర్టు వంటి 12 రకాల గుర్తింపు కార్డులను చూపించి ఓటు వేయుటకు ఎన్నికల సంఘం గుర్తించడం జరిగిందని కలెక్టర్ వివరించారు.
ఆత్మకూరు నియోజక వర్గ ఉప ఎన్నికకు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ వుంటారని, జిల్లా కోవిడ్ నోడల్ అధికారిగా డి.ఎం.హెచ్.ఓ వుంటారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేసేందుకు అవసరమైన కమిటీలను ఏర్పాటు చేయడం తో పాటు అవసరమైన పోలీసు సిబ్బందిని నియమించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ప్రజలకు, అభ్యర్ధులకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ హరెందిరా ప్రసాద్, అడిషనల్ ఎస్.పి. హిమావతి, జిల్లా రెవిన్యూ అధికారిణి వెంకట నారాయణమ్మ, కలెక్టరేట్ పరిపాలనాధికారి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
