Clock Of Nellore ( Nellore ) – రాష్ట్రంలో రైతులకు మేలు చేకూరే విధంగా రైతు బజార్ల పునర్నిర్మాణం చేపట్టి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం నెల్లూరు నగరంలోని ఫత్తేఖాన్ పేట రైతు బజార్ ను మంత్రి సందర్శించారు.
ముందుగా రైతు బజార్ కు విచ్చేసిన మంత్రి కి వైసీపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నగర మేయర్ స్రవంతి, జాయింట్ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి రైతు బజార్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పనలో భాగంగా రైతు బజార్ల పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టేందుకు మొదటగా ఫత్తేఖాన్ పేట రైతు బజార్ ను సందర్శించినట్లు చెప్పారు. జిల్లాలో ఫత్తేఖాన్ పేట, నవాబుపేట, కందుకూరు, కావలిలో రైతు బజార్లు ఉన్నాయని, వీటన్నిటినీ కూడా పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి తీసుకొస్తామన్నారు.

ప్రజలకు తూకాల్లో మోసాలు లేకుండా నాణ్యమైన, తాజా కూరగాయలు సరసమైన ధరల్లో లభించి, దళారుల ప్రమేయం లేకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో రైతు బజార్ల పూర్వ వైభవానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. అలాగే వ్యవసాయ, మార్కెట్ కమిటీలను త్వరలోనే ఏర్పాటు చేస్తామని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కమిటీల్లో 50 శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు, 50 శాతం మహిళలకు అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. రైతులు కూడా దళారుల మాటలు విని మోసపోకుండా ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకొని రైతుబజార్లలో తమ పంటలను విక్రయించుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ పి. కొండయ్య, జిల్లా సహకార అధికారి తిరుపాల్ రెడ్డి, ఎన్ డి సి సి బ్యాంకు చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, నెల్లూరు ఏఎంసి ఛైర్మైన్ ఏసు నాయుడు, విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, స్థానిక వైసిపి నాయకుడు కార్పొరేటర్ పిండి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి కాకాణి కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని నెల్లూరులోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.
