Clock Of Nellore ( Gudur ) – తిరుపతి జిల్లాలోని గూడూరులో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ముగ్గురు బుకీల ద్వారా ఇద్దరు పాత నేరస్తులు ఈ బెట్టింగ్ ను నిర్వహిస్తున్నట్లు స్పష్టమైన సమాచారం అందుకున్న గూడూరు రూరల్ పోలీసులు ( Tirupathi Police ) వారుండే నివాసంపై దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. గూడూరు మండలం, చెన్నూరుకు చెదిన మధిర నవశేఖర్, మధిర ఉమామహేశ్వర రావు అనే ఇద్దరు అన్నదమ్ములు… ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ ల నేపద్యంలో బెట్టింగ్ కు తెరలేపారు. అదే ప్రాంతానికి చెందిన పనుజుల వెంకట సుధీర్, పోలిశెట్టి వెంకట రమణయ్య, వేమనబోయిన అశోక్ అనే ముగ్గుర్ని బుకీలుగా నియమించుకుని ఈ దందాను సాగిస్తున్నారు. ఈ క్రమంలో గూడూరు రూరల్ సిఐ శ్రీనివాస రెడ్డి సిబ్బందితో కలిసి గత రాత్రి చెన్నూరులోని వారి నివాసంపై రైడ్ చేయగా బెట్టింగ్ గుట్టు రట్టయింది. దీంతో అక్కడున్న ఈ 5 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 5 లక్షల 92వేలు నగదును, 5 సెల్ ఫోన్లు, ఓ టీవిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సోమవారం సిఐ శ్రీనివాస రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. ప్రధాన ముద్దాయి అయిన మధిర నవశేఖర్ గతంలో కూడా క్రికెట్ బెట్టింగ్ చేస్తుండగా అరెస్ట్ చేసి ఉన్నామని అతనిపై రౌడీ షీట్ కూడా నమోదు చేసి ఉందన్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో ఈ రొంపిలోకి దిగవద్దని సిఐ శ్రీనివాస రెడ్డి యువతకు సూచించారు.
