11 నుంచి 9 నెలల పాటూ ప్రజల్లోనే : మంత్రి రేసులో ఉన్నానన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – ఐదేళ్లకు ఓ సారి ప్రజల్లోకి వెళ్లే ఎమ్మెల్యేగా ఉండటం తనకు ఇష్టం లేదని… నిత్యం ప్రజల్లోనే ఉండటం తనకు ఇష్టమైన చర్య అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రెండు దఫాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన నియోజకవర్గ ప్రజలను అనేక దఫాలు పలకరించానని మరో సారి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానన్నారు. ఈనెల 11వ తేదీ నుండి 9 నెలల పాటూ ప్రజల్లోనే ఉంటానని పేర్కొన్నారు. నెల్లూరులోని వారి కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. జగనన్న మాట – గడప గడపకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాట అనే పేరుతో నియోజకవర్గంలో 9 నెలల పాటూ పర్యటిస్తానని వెల్లడించారు. ఉదయం అల్పాహారం నుండి మధ్యాహ్నం, రాత్రి భోజనం వరకూ ప్రజలతోనేనని స్పష్టం చేశారు. అవసరమైతే రాత్రి బస కూడా కార్యకర్తల ఇళ్లలోనే చేస్తానని చెప్పారు. ఈనెల 11వ తేదీ ఉదయం 9:15 గంటలకు గొల్లకందుకూరు గ్రామం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. తొలి విడతగా 33 రోజుల పాటూ ఏకధాటిగా 18 గ్రామాల్లో పర్యటిస్తానని తర్వాత వారం విరామం ఇచ్చి రెండో విడత ప్రారంభిస్తానని తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి గడప గడపకూ వెళ్లి తెలియజేస్తానని, మా లోటు పాట్లు కూడా తెలుసుకుని సరిచేసుకుంటానని శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ 9 నెలల పాటూ కార్యకర్తలు, బంధు, మిత్రుల శుభకార్యాలకు నా తరపున తన సతీమణి హాజరవుతుందని తెలిపారు.

మంత్రి కావాలని ఎవరికుండదు !
మంత్రి వర్గ విస్తరణలో మీ పేరు కూడా వినిపిస్తుందని విలేకరులు ఎమ్మెల్యే కోటంరెడ్డిని అడగ్గా మంత్రి కావాలని ఎవరికుండదు. ప్రతీ ఒక్క ఎమ్మెల్యేకూ ఉంటుంది. అయితే కొందరికే అవకాశం వస్తుంది. మంత్రి రేసులో నేనూ ఉన్నానని వ్యాఖ్యానించారు.

Read Previous

కుంటుతూ కాదు… కులాసాగా నడవండిక : 50 % రాయితీతో నారాయణలో చికిత్స

Read Next

నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలు : కాబోయే మంత్రులు వీళ్లే

Leave a Reply

Your email address will not be published.