Clock Of Nellore ( Gudur ) – అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంకుశ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు పిలుపునిచ్చారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నెల్లూరుజిల్లాలోని గూడూరులో జరిగిన నియోజకవర్గ సమన్వయ కమిటి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అంతకు ముందు ఆయన గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరుజిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ టవర్ క్లాక్ సెంటర్ లో జరుగుతున్న దీక్షకు సంఘీభావం తెలిపారు. గూడూరును ప్రత్యేకంగా జిల్లాగా ప్రకటించాలని లేని పక్షంలో నెల్లూరుజిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
అనంతరం టిడిపి కార్యాలయంలో జరిగిన పార్టీ సమన్వయ కమిటి సమావేశంలో సోమిరెడ్డి పాల్గొని మాట్లాడారు. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని హత్య ఎవరు చేశారో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుసునని అన్నారు. బాబాయ్ హత్యను అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన వాస్తవం నిజం కాదా అని ప్రశ్నించారు. సిబిఐ విచారణలో బయటకు వస్తున్న వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కొందరు అధికారులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, ఎప్పుడూ ఓకే పార్టీ అధికారంలో ఉండదన్న విషయాన్ని అధికారులు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.
రైతుల అభీష్ఠానికి వ్యతిరేకంగా వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని, విద్యుత్ సరఫరా సక్రమంగా ఇవ్వడం లేదని సోమిరెడ్డి పేర్కొన్నారు. ఇంటి పన్ను భారీగా పెంచారని, ఎప్పుడూ లేని విధంగా చెత్తపై పన్ను వేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజా వ్యతిరేక విధానాలకు సిఎం జగన్ పాల్పడుతున్నారని ఆరోపించారు. వీటన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సోమిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని, నేతలు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, తిరుపతి పార్లమెంటు టిడిపి అధ్యక్షులు నరసింహ యాదవ్, వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, సత్యవేడు నియోజకవర్గ ఇంఛార్జ్ జేడి రాజశేఖర్, తిరుపతి పార్లమెంటు టిడిపి ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి, మహిళా నాయకురాలు చక్రాల ఉష తదితరులు పాల్గొన్నారు.

