దుకాణాల తొలగింపుతో రోడ్డున పడ్డ చిరు వ్యాపారుల బ్రతుకులు

Clock Of Nellore ( Nellore ) – విశాలమైనా రహదారి ఉన్నా ట్రాఫిక్ సాకుతో అధికారులు తీసుకునే కొన్ని నిర్ణయాలు సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. రోడ్డు పక్కన ఓ చిన్న దుకాణం, లేదా నాలుగు కర్రలతో ఏర్పాటు చేసుకున్న ఓ చిన్న గుడారం. అది కేవలం ఒక వ్యాపారం మాత్రమే కాదు. ఆ కుటుంబానికి ఆకలి తీర్చే ఆధారం. ఇవేమీ గుర్తించకుండా కొందరు అధికారులు చిరు వ్యాపారులపై తమ ప్రతాపం ప్రదర్శిస్తుంటారు. నెల్లూరు బట్వాడిపాళెంలోని వాకర్స్ రోడ్డులో బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్ వైపు రోడ్డు పక్కను సుమారు 5 మంది చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. జయరామయ్య అనే వ్యక్తి గత నాలుగేళ్లుగా టెంకాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సుజ్జి అనే మహిళ చేపలు అమ్ముకుంటోంది. వీరయ్య అనే వ్యక్తి బిర్యానీ షాపు పెట్టుకుని ఉన్నాడు. కృష్ణ అనే వ్యక్తి పానీపూరి అమ్ముతుంటాడు. అందరూ సుమారు 5 ఏళ్ల నుండి రోడ్డు మార్జిన్ లో చిన్న బంకులు, చిన్న టెంటులు వేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. ఆ ప్రాంతంలో రహదారి వెడల్పుగా ఉన్న నేపద్యంలో వీరి వల్ల ట్రాఫిక్ లో ఎలాంటి ఇబ్బందీ లేదు.

ఈ క్రమంలో శుక్రవారం ఉదయం స్థానిక సచివాలయ సిబ్బంది అక్కడకు చేరుకుని బంకులను మూయించి, చిన్న చిన్న కర్రల సాయంతో ఏర్పాటు చేసుకున్న దుకాణాలను కూల్చివేయించారు. సమయమిస్తే మేమే వెళ్లిపోతామని వ్యాపారులు బ్రతిమిలాడినా వారు వినకుండా కూల్చివేసి, కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాలతోనే తాము కూల్చివేశామని చెప్పుకొచ్చారు. దీనిపై చిరు వ్యాపారులు కన్నీరు మున్నీరవుతున్నారు. కొంత సమయం ఇస్తే తామే ప్రత్యామ్నాయం చూసుకుని వెళ్లే వారమని, ఉన్న ఫళంగా తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన చెందుతున్నారు. రోడ్డు మార్జిన్ లో వ్యాపారాలు చేసుకునే నిమిత్తం నెల్లూరు కార్పొరేషన్ అధికారులు ట్రేడ్ లైసెన్స్ పేరుతో ప్రతి సంవత్సరం తమ వద్ద ఫీజులు వసూలు చేస్తున్నారని, అయినప్పటికీ తమ దుకాణాలు తొలగించడం ఏంటని లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్ కమిషన్ మరియు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమపై దయతలచి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. తమ దుకాణాల కారణంగా ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేదని, తాము ఇదే ప్రాంతంలో తిరిగి వ్యాపారాలు చేసుకునే విధంగా సహకరించాలని అభ్యర్ధిస్తున్నారు.

Read Previous

సైబర్ మోసాలపై అసెంబ్లీలో గళమెత్తిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

Read Next

పెరుగుతున్న బీపి, షుగర్ సమస్యలు : మెడికవర్ లో అధునాతన వైద్య సేవలు

Leave a Reply

Your email address will not be published.