కాకాణి కోసం వెతుకులాట… హైకోర్టు నిర్ణయంతో స్పీడ్ పెంచిన పోలీసులు

Clock Of Nellore ( Nellore ) – మాజీ మంత్రి, వైసీపి జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేసేందుకు నెల్లూరుజిల్లా పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. నిన్న మొన్నటి వరకూ హైకోర్టు తీర్పు కోసం పోలీసులు వేచి చూశారు. అయితే హైకోర్టులో కాకాణికి ఎలాంటి ఊరట లభించకపోవడంతో పోలీసులు స్పీడు పెంచారు. విదేశాలకు పారిపోతారనే ఉద్దేశ్యంతో ఇప్పటికే పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి ఉన్నారు. మొత్తం నాలుగు పోలీసు బృందాలు కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం గాలిస్తున్నాయి. అక్రమ మైనింగ్, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులో కాకాణి పెట్టుకున్న ముందస్తు బెయిల్ కు హైకోర్టు నిరాకరించింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్ట నిబంధనలకు అనుగుణంగా నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ పరిధిని తేల్చే వ్యవహారాన్ని హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి… ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కు అప్పగిస్తూ కీలక ఉత్తర్వులు ఇచ్చారు. ప్రధాన న్యాయమూర్తి ఈ పిటిషన్లపై విచారణ చేస్తారని పేర్కొన్నారు. అప్పటి వరకూ అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. హైకోర్టు నిర్ణయంతో కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. కేసు ఈ దశలో ఉన్నందున ఆయన సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించే పరిస్థితి లేదు. కాకాణి పోలీసులకు లొంగిపోవడమా లేదా అరెస్టు అవడమా అనేదే మిగిలి ఉంది. మరో వైపు కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేయకుండా ఉండేందుకు తెలుగుదేశం పార్టీలోని కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

Read Previous

సర్కారు వారి పాట : ఈనెల 25న జైలు మామిడి కాయల వేలం

Read Next

పహల్గామ్ ఉగ్రదాడిలో కావలి వాసి దుర్మరణం

Leave a Reply

Your email address will not be published.