Clock Of Nellore ( Kodavalur & Nellore ) – చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో పల్లెలు ప్రగతి బాట పడుతున్నాయన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. 5 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి కొడవలూరు మండల కేంద్రానికి విచ్చేసిన ఆమెకు టిడిపి కూటమి నాయకులు బ్రహ్మరధం పట్టారు. అడుగడునా హారతులతో అపూర్వ స్వాగతం పలికారు. రోడ్డు ప్రారంభోత్సవ అనంతరం ఆమె షాదీ మంజిల్ సందర్శించారు. షాదీ మంజిల్ ఆధునీకరణ పనులకై ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో 10 లక్షలు CSR నిధులు మంజూరు చేశారు. కొడవలూరు మండల వ్యవసాయ శాఖ కార్యాలయ మరమ్మత్తుల కోసం 5 లక్షల రూపాయలు కేటాయించారు. స్థానిక ప్రాధమిక వైద్యశాలను సందర్శించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వసతుల లేమిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపి నిధుల ద్వారా హాస్పిటల్ లో టాయిలెట్స్ తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తానన్నారు. అనంతరం ఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ గత ఐదేళ్లలో జరిగిన అరా కొరా పనులు కూడా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా అసంపూర్తిగానే వున్నాయన్నారు. రోడ్లు, డ్రైన్లు లాంటి అభివృద్హి పనులు స్థానిక నాయకులే నాణ్యతా ప్రమాణాలు పాటించి పూర్తి చేయాలని కోరారు. మార్చిలో ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. గతంలో తట్టెడు మట్టి కూడా వేయలేని పరిస్థితిలో వున్న గ్రామీణ ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ మంత్రి అయ్యాక కొత్త రోడ్డు నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఒక్క కొడవలూరు మండలంలోనే గత 7 నెలలలో 6 కోట్ల 50 లక్షల అభివృద్ధి పనులు చేశామన్నారు. మరో 1 కోటి మిగులు నిధులున్నాయన్నారు. అట్టడుగు వర్గాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలోనే న్యాయం జరుగుతుందన్నారు. స్థానిక నాయకులు గ్రామీణ సమస్యలపై దృష్టి సారించాలని అధికారులతో మమేకమై ప్రజా సమస్యలు తీర్చడంలో చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సుబ్బారావు, తహసీల్దారు స్ఫూర్తి రెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి జి ఎన్ శేఖర్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు వెంకటరమణా రెడ్డి, మండల పార్టీ ఇంచార్జి ముంగమూరు శ్రీహరి రెడ్డి, బెజవాడ వంశీకృష్ణా రెడ్డి, జిలానీబాషా, పంది శ్రీనివాసులు, వెంకీ, నాయబ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి నారా లోకేష్ సారధ్యంలో ప్రభుత్వ విద్యకు పూర్వ వైభవం…
గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ప్రాధమిక విద్యా విధానం గందరగోళానికి గురైందన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. గత ప్రభుత్వం అనాలోచితంగా తీసుకువచ్చిన 117 జీవో ఉపసంహరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నెల్లూరు నగరం మాగుంట లే అవుట్ లోని విపిఆర్ నివాసంలో విద్యాశాఖ అధికారులతో విద్యా ప్రగతి పై సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త విధానంలో ఐదు రకాల పాఠశాలలను ప్రతిపాదనలపై చర్చించారు. గత ప్రభుత్వంలో ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన 3, 4, 5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలలకు వెనక్కి తీసుకొచ్చే విషయమై విద్యాశాఖ అధికారుల అభిప్రాయం కోరారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6 – 8 తరగతుల విద్యార్థుల సంఖ్య 30, అంతకంటే తక్కువగా ఉంటే సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసి, దాన్ని ప్రాథమిక పాఠశాలగా మార్చాలని ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు సూచించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త విధానంలో ఐదు రకాల పాఠశాలలు శాటిలైట్ ఫౌండేషనల్ స్కూల్, బేసిక్ ప్రైమరీ స్కూల్, మోడల్ ప్రైమరీ స్కూల్ ల విధి విధానాల ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి బాలాజీరావు, పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, కోవూరు, బుచ్చిరెడ్డి పాళెం, విడవలూరు, కొడవలూరు మరియు ఇందుకూరు పేటకు సంబంధించిన మండల విద్యా శాఖాధికారులు పాల్గొన్నారు.
మైత్రి పెర్టినెస్ట్ హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి …
నెల్లూరు నగరంలోని మినీబైపాస్ రోడ్డు అన్నమయ్య సర్కిల్స్ సమీపంలో మైత్రి ఫెర్టినెస్ట్ అడ్వాన్సుడ్ లాప్రోస్కోపిక్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి… మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. మైత్రి పెర్టినెస్ట్ సంతాన సాఫల్య కేంద్రం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందివ్వాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మైత్రి పెర్టినెస్ట్ హాస్పిటల్ అండ్ అడ్వాన్సుడ్ లాప్రోస్కోపిక్ సెంటర్ యాజమాన్యానికి అభినందనలు తెలియచేసారు.
