ఇది కాదా… అభివృద్ధి అంటే : నెల్లూరు సభలో చంద్రబాబుపై జగన్ ఫైర్

Clock Of Nellore ( Nellore ) – చంద్రబాబు అభివృద్ధి లేదూ లేదూ అని విష ప్రచారం చేస్తున్నారు. మరీ రాష్ట్రంలో తాను చేపట్టిన పనులను అభివృద్ధి కాక ఏమంటారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి…. టిడిపి అధినేత చంద్రబాబును ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా 15 మెడికల్ కాలేజీలు నిర్మాణమవుతున్నాయి, 4 సీ పోర్టులు, 10 ఫిషింగ్ హార్భర్లు నిర్మాణంలో ఉన్నాయి, నెల్లూరుజిల్లాలోని రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్భర్ పనులు దాదాపు పూర్తయ్యాయి… వీటిని అభివృద్ధి కాక ఏమంటారని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం సాయంత్రం నెల్లూరుకు విచ్చేశారు. పలమనేరు ప్రచార సభను ముగించుకుని హెలికాప్టర్ ద్వారా నెల్లూరు హైస్కూల్ గ్రౌండ్ కు చేరుకుని అక్కడి నుండి కారులో గాంధీ బొమ్మ సెంటర్ కు చేరుకున్నారు. అక్కడ ప్రచార సభలో ప్రసంగించారు. అభివృద్ధిపై నెల్లూరు వేదికగా చంద్రబాబుకు చెబుతున్నా… నేను చేసిన పనులను అభివృద్ధి కాక ఇంకేమంటారని ప్రశ్నించారు. అభివృద్ధి లేదంటూ చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాడు – నేడు ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం… గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమంతో పాటూ అభివృద్ధీ సమపాళ్లలో జరిగిందని జగన్ చెప్పుకొచ్చారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలు మెచ్చే ఒక్క పనైనా చేశారా అని వెల్లడించారు. సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు అమలు చేయలేని హామీలు ఇస్తున్నారు… ఎవ్వరూ నమ్మవద్దు… మళ్లీ చెబితే 2014 ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించాలంటూ ప్రజలకు జగన్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలని, ప్రజలు మోసపూరితమైన హామీలను నమ్మకుండా మరో సారి వైసీపికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఖలీల్ అహ్మద్, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు ఎంపి అభ్యర్ధి విజయసాయిరెడ్డిలను ప్రజలకు పరిచయం చేసి ఈనెల 13న జరిగే ఎన్నికల్లో వీరిని దీవించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపి జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కోవూరు, సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్ధులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. మరో వైపు జగన్ ప్రచార సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గాంధీ బొమ్మ సెంటర్ కిక్కిరిసిపోయింది.

Read Previous

నెల్లూరు సిటీలో వార్ వన్ సైడే… చేరికల కార్యక్రమంలో నారాయణ వెల్లడి

Read Next

నిన్న చేరి… నేడు మారి… కోవూరులో చిత్రం… భళారే విచిత్రం….

Leave a Reply

Your email address will not be published.