Clock Of Nellore ( Nellore ) – వినాయక చవితి పండుగ వేడుకలు, అనంతర నిమజ్జన కార్యక్రమాలకు అత్యంత పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ యం. హరినారాయణన్ పేర్కొన్నారు. శుక్రవారం నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వినాయక చవితి పండుగ ఘనంగా నిర్వహించేందుకు అధికారుల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల నగరంలో రొట్టెల పండుగను అందరి సహకారంతో ఘనంగా నిర్వహించుకున్నామని, అదే విధమైన స్ఫూర్తితో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు, అధికారులతో చర్చించి అన్ని విధాలుగా వారికి సహకారం అందజేసి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు తోడ్పడాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేసి గణేష్ ఉత్సవాలను జయప్రదం చేయాలన్నారు. గణేష్ ఘాట్ దగ్గర విద్యుత్ దీపాలతో అలంకరణ చేయాలన్నారు. విద్యుత్ శాఖ ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుని ఊరేగింపు జరుగే మార్గాల్లో విద్యుత్ తీగలను సరిచేసుకోవాలన్నారు. చెరువులో నీటి నిల్వలు సరిపోయే పరిమాణంలో ఉండేట్లు చూడాల్సిందిగా ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఘాట్ పరిసర ప్రాంతాల్లో శానిటేషన్, మంచినీటి సౌకర్యం తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. గజ ఈతగాళ్ళను నియమించాల్సిందిగా మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ వికాస్ మర్మత్ మాట్లాడుతూ నగరంలో నాలుగు ప్రాంతాల్లో రిసెప్షన్ సెంటర్ల ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 10 సిసి కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరా ను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు 5 టన్నుల కెపాసిటీ గల 3 క్రేన్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జేసిబి ని కూడా అందుబాటులో ఉంచుతున్నామన్నారు.
జిల్లా ఎస్ పి తిరుమలేశ్వర రెడ్డి మాట్లాడుతూ గణేష్ ఉత్సవ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి అందరూ సహకరించాలన్నారు. ముఖ్యంగా విగ్రహలు ఏర్పాటు చేయదలచిన వారికి ముందస్తు అనుమతులు తప్పనిసరన్నారు. అనుమతి కోసం విగ్రహం సైజు, ఉత్సవం జరిగే రోజుల సంఖ్య తదితర వివరాలతో కూడిన నిర్ణిత ప్రొఫార్మాను డి ఎస్ పి కార్యాలయంలో అందుబాటులో ఉంచామన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ హిమవతి, జడ్పీ సి ఇ ఓ చిరంజీవి, మత్స్య శాఖ జెడి నాగేశ్వరరావు, రెవిన్యూ, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Reporter – P. Eswar