అపోలో హాస్పిటల్ లో అవయవదానం : చనిపోయి నలుగురికి ప్రాణదానం చేసిన మహిళ

Clock Of Nellore ( Nellore ) – బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయి అవయవదానం ద్వారా నలుగురికి ప్రాణదానం చేసిన అరుదైన ఘటన నెల్లూరులో గురువారం జరిగింది. మృతురాలి కుటుంబసభ్యుల నిర్ణయంతో నాలుగు కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసింది. వివరాల్లోకి వెళితే నెల్లూరు నగరానికి చెందిన 35 మహిళ నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్టోక్ కు గురి కాగా కుటుంబ సభ్యులు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్ వైద్యులు ఐసియూలో ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. బుధవారం సాయంత్రం మహిళ బ్రెయిన పూర్తిగా డెడ్ అయినట్లు వైద్యులు గుర్తించి ఆ విషయాన్ని భర్త, ఇతర కుటుంబసభ్యులకు తెలియజేశారు. బ్రెయిన్ పూర్తిగా డెడ్ అయిన నేపద్యంలో బ్రతికే అవకాశం లేదని చెప్పడంతో దుఖంలో నిండిపోయిన కుటుంబసభ్యులు అవయవదానం ద్వారా ప్రాణాపాయంలో ఉన్న పలువురి కుటుంబాల్లో సంతోషం నింపాలని అవయవదానానికి ముందుకొచ్చి, ఆ విషయం అపోలో వైద్యులకు తెలియజేశారు. వెంటనే హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాం సతీష్ ఈ విషయాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోని జీవన్ థాన్ ట్రస్ట్ కు తెలియజేయగా వారు వెంటనే స్పందించి ఏఏ అవయవాలు ఇతరులకు అమర్చే అవకాశం ఉందో తెలియజేయాలని కోరారు.

దీంతో వైద్యులు ఆ మహిళకు పలు పరీక్షలు నిర్వహించి గుండె, లివర్, రెండు కిడ్నీల పనితీరు బాగున్నాయని రిపోర్ట్ చేశారు. దీంతో జీవన్ థాన్ ట్రస్ట్ అధికారులు అప్పటికే అవయవాల కోసం వారికి ధరఖాస్తు చేసి ఉన్న రోగుల సీనియారిటీ జాబితాను పరిశీలించారు. గుండెను తిరుపతి పద్మావతి హాస్పిటల్ ఉన్న రోగికి, లివర్ ను విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో ఉన్న రోగికి, ఒక కిడ్నీని నెల్లూరు నారాయణ హాస్పిటల్ లో ఉన్న రోగికి, మరో కిడ్నీని నెల్లూరు అపోలో హాస్పిటల్ లో ఉన్న రోగికి జీవన్ థాన్ ట్రస్ట్ అధికారులు కేటాయించారు. ఈ నేపద్యంలో గురువారం ఆయా హాస్పిటల్స్ వైద్యులు నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ కు చేరుకున్నారు. అంతకు కొద్ది నిముషాల ముందే చనిపోయిన బ్రెయిన్ డెడ్ అయిన మహిళ శరీరం నుండి నాలుగు అవయవాలను వేరు చేశారు. రెవెన్యూ, పోలీసు శాఖల సహాయంతో ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానల్ ద్వారా ఆయా అవయవాలను కేటాయించిన హాస్పిటల్స్ వైద్యులు ప్రత్యేక అంబులెన్స్ ల ద్వారా త్వరితగతిన తీసుకెళ్లారు. చివరగా చనిపోయిన మహిళ భౌతిక కాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగించే సమయంలో అపోలో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది ఆమెకు పూలమాలలతో నివాళి అర్పించి, గౌరవ వందనం చేశారు. ఆమె భౌతికంగా చనిపోయినప్పటికీ అవయవదానం ద్వారా ఇంకా బ్రతికే ఉందని అన్నారు. నిండు విషాదంలో కూడా అవయవదానానికి ముందుకొచ్చిన కుటుంబసభ్యులకు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాం సతీష్ కృతజ్ఞతలు తెలియజేశారు.

 

Reporter – P. Eswar

Read Previous

ఘనంగా వెంకయ్యస్వామి రథోత్సవం : పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కాకాణి

Read Next

రేపే ఆదిత్య – L1 ప్రయోగం : మొదలైన కౌంట్ డౌన్

Leave a Reply

Your email address will not be published.