ఘనంగా వెంకయ్యస్వామి రథోత్సవం : పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కాకాణి

Clock Of Nellore ( Golagamudi ) – రోజు రోజుకి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి ప్రాశస్త్యం దశదిశలా వ్యాప్తి చెందుతుందని, ఇలాంటి గొప్ప ఆలయం సర్వేపల్లి నియోజకవర్గం లో ఉండడం నియోజకవర్గ ప్రజల అదృష్టమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఉదయం వెంకటాచలం మండలం గొలగమూడిలోని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి 41వ ఆరాధోత్సవాల్లో భాగంగా చివరి రోజు రథోత్సవాన్ని పురస్కరించుకొని స్వామి వారికి సతీ సమేతంగా మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం భక్తుల కర్పూర నీరాజనాలు, ఓం నారాయణ.. ఆదినారాయణ నామ స్మరణలతో గొలగమూడి మారుమ్రోగగా, రథోత్సవాన్ని మంత్రి ప్రారంభించారు. రథంపై ఆశీనులైన వెంకయ్య స్వామి వారిని పెద్దఎత్తున భక్తులు దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎనిమిది సంవత్సరాలు ఎమ్మెల్యే హోదాలో, రెండేళ్లు మంత్రి హోదాలో వెంకయ్య స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే మహద్భాగ్యం తమకు లభించడం పూర్వజన్మ సుకృతమని మంత్రి చెప్పారు. దేశం నలుమూలల నుంచి ఆరాధన ఉత్సవాలకు భక్తులు విచ్చేసారని, ఆలయ పాలకమండలి సభ్యులు, అధికారుల సమన్వయంతో, భక్తుల సహకారంతో ఆరాధన ఉత్సవాలు విజయవంతంగా జరిగాయని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి నిరంతరం పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై వెంకయ్య స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని, సర్వేపల్లి నియోజకవర్గం ప్రజల ఆశీస్సులు, వెంకయ్య స్వామి దీవెనలతో మరో ఐదేళ్లపాటు స్వామి వారి సేవలో తరించే అవకాశం తనకు లభించాలని మంత్రి ఆకాంక్షించారు.

తొలుత ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ అర్చకులు, పాలకమండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో మంత్రి పాల్గొన్నారు. వీరాంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. తదుపరి అన్నదాన సత్రంలో భక్తులకు భోజనం వడ్డించిన మంత్రి, వారితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి బాలసుబ్రమణ్యం, ఆర్డిఓ మలోల, తహసిల్దార్ కృష్ణ, ఆలయ పాలకమండలి సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

 

Reporter – Sk. Khajavali

Read Previous

“రూరల్” లో శరవేగంగా అభివృద్ధి పనులు : ఎంపీ ఆదాల వెల్లడి

Read Next

అపోలో హాస్పిటల్ లో అవయవదానం : చనిపోయి నలుగురికి ప్రాణదానం చేసిన మహిళ

Leave a Reply

Your email address will not be published.