Clock Of Nellore ( Nellore ) – వన్ మ్యాన్ షో అంటారు కదా… కానీ ఇక్కడ మాత్రం వన్ ఉమెన్ షో జరిగింది. రాజకీయ అనుభవం లేదు ఉన్నతందా కేవలం చదువు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాజకీయ ఎత్తుగడలను ప్రదర్శించిన నెల్లూరు నగర మేయర్ స్రవంతి తనదైన శైలిలో బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో కొందరు తమ గళంతో సభను హోరెత్తించాలని చూసినా మేయర్ మాత్రం అలాంటి వాటికి ఆస్కారమే లేకుండా సభ మొత్తాన్ని విజయవంతంగా నియంత్రించడమే కాకుండా బడ్జెట్ కు సభ ఆమోదం పొందేలా వ్యవహరించి మొత్తానికి సభను ముగించారు. వైసీపి తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్గీయురాలిగా ఉన్న మేయర్ ను… వైసీపిలోనే ఉన్న ఇతర కార్పొరేటర్లు ఇబ్బంది పెడతారని అందరూ ఊహించిన అంచనాలను మేయర్ తలకిందులు చేస్తూ సభను వన్ ఉమెన్ షో గా నిర్వహించి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

నెల్లూరులోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం 10 గంటలకు మేయర్ స్రవంతి అధ్యక్షతన బడ్జెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రారంభమైన నిముషాల వ్యవధిలోనే వైసీపి కార్పొరేటర్లు బొబ్బల శ్రీనివాస యాదవ్, మూలే విజయభాస్కర్ రెడ్డి, మొయిళ్ల గౌరి… నగరంలో జరగాల్సిన అభివృద్ధి పనులపై సర్వసభ్య సమావేశం నిర్వహించాలని పట్టుబట్టారు. ఎప్పుడు నిర్వహిస్తారో తేదీని ప్రకటించి బడ్జెట్ లోకి వెళ్లాలని పట్టుబట్టారు. సర్వసభ్య సమావేశం జరిగి 8 నెలలు పూర్తయిందని పేర్కొన్నారు. తేదీ ప్రకటించే వరకూ సభను ముందుకు వెళ్లనీయబోమని స్పష్టం చేశారు. దీంతో మేయర్ ఖచ్చితంగా సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హామీ కాదని తేదీని ప్రకటించాలని ఆ ముగ్గురు కార్పొరేటర్లు పట్టుబట్టారు. ఇదే క్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కలుగజేసుకుని సభను రాజకీయాలకు అతీతంగా నిర్వహించుకోవాల్సి ఉందని, అభివృద్ధే ప్రధాన అజెండాగా ఉండాలని మేయర్ ను కోరారు. సహచర సభ్యులు కోరిన అంశం కూడా సబబేనని అన్నారు. సుమారు గంటన్నర పాటూ ఈ వాదోపవాదాలు జరిగాయి. ఒకానొక సమయంలో వాదోవాదాలు రాజకీయ అంశాల జోలికెళ్లాయి. కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి… మేయర్ ను ఉద్దేశించి మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పి మేయర్ కుర్చీలో కూర్చోవాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి అభివృద్ధి అని పార్టీ మారిన మీరు అభివృద్ధి కోసం సమావేశం పెట్టమంటే ఎందుకు పెట్టరని బొబ్బల శ్రీనివాస యాదవ్ ప్రశ్నించారు. దీంతో మేయర్ స్రవంతి దనదైన శైలిలో స్పందించారు. అభివృద్ధి కోసం మీ డివిజన్లకు ఎప్పుడైనా మేయర్ అయిన తనను ఆహ్వానించారా అని ఎదురు ప్రశ్నించారు. మహిళ అన్న కారణంతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, తాను ఏ పార్టీనో ప్రజలకు తెలుసునని బదులిచ్చారు. వాదోపవాదాలు జరిగిన గంటన్నర పాటూ కేవలం మేయర్ ఒక్కరే వారిని నిలువరించారు. ఓ రకంగా చెప్పాలంటే సభ మొత్తం వన్ ఉమెన్ షో గా మేయర్ వ్యవహరించారు.

అనంతరం సభను 10 నిముషాల పాటూ వాయిదా వేసి డిప్యూటీ కమిషనర్ తో మేయర్ సమావేశమయ్యారు. సర్వసభ్య సమావేశం తేదీపై చర్చించారు. అనంతరం తిరిగి ప్రారంభమైన సభను ఉద్దేశించి మేయర్ మాట్లాడుతూ ఈనెల 24వ తేదీనా సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి బడ్జెట్ ను ప్రవేశపెట్టి అక్కడి నుండి వెళ్లి పోయారు. అయితే కార్పొరేటర్లు సభ ఇంకా ఉందని సమావేశ మందిరంలోనే కూర్చొని ఉండగా డిప్యూటీ కమిషనర్ చెన్నుడు బడ్జెట్ సమావేశం ముగిసిందని, బడ్జెట్ ఆమోదం పొందిందని ప్రకటించి వెళ్లిపోయారు. దీంతో కార్పొరేటర్లు ఆశ్చర్యపోయారు. మొత్తానికి మేయర్ స్రవంతి తనదైన శైలిలో సభను నిర్వహించారు. ఎక్కడా రాజకీయాల జోలికి వెళ్లకుండా సభను నిర్వహించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వ్యతిరేకించిన పలువురు వైసీపి కార్పొరేటర్లు సభలో కొన్ని రాజకీయ వ్యాఖ్యలు చేసినా మేయర్ వాటికి తనదైన శైలిలో సమాధానం చెప్పి సభను ముగించారు. అధికారుల వద్దే సభ ముగిసిందని ప్రకటింపజేసి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. మేయర్ గా స్రవంతి ఎన్నికయ్యి సుమారుగా రెండేళ్లు కావస్తుంది. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఎప్పుడూ రాజకీయ చతురతను ప్రదర్శించలేదు మేయర్. తొలిసారిగా తన మార్కు రాజకీయం ప్రదర్శించారు. మేయర్ కు కూడా రాజకీయాలు వంటబట్టాయే అని కొందరు కార్పొరేటర్లు చర్చించుకునేంతగా ఆమె సభను నడిపించారంటేనే అర్ధమవుతుంది ఆమె సభను నిర్వహించిన తీరు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వ్యతిరేకించిన పలువురు కార్పొరేటర్లు సభలో ఏదో చేయాలని ప్రయత్నం చేసినా అందుకు మేయర్ ఆస్కారం ఇవ్వలేదు.
