Clock Of Nellore ( Nellore ) – ప్రభుత్వ భూములను ఆక్రమించి ఎలా గుడిసెలు వేస్తారని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. నెల్లూరు నగర శివారులోని కొత్తూరులోని 12 ఎకరాల స్థలంలో దళితులు గుడిసెలు వేసుకొని గత కొద్ది కాలంగా ఉంటున్నారు. ఈ గుడిసెలను గురువారం పోలీసులు తొలగించారు. తొలగింపు సమయంలో అడ్డొచ్చిన సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ నేత పందిటి సుబ్బయ్యతో సహా పలువుర్ని అరెస్ట్ చేసి తరువాత విడిచిపెట్టారు. అనీల్ కుమార్ యాదవ్ అండతోనే స్థానిక నేత కూకాటి ప్రసాద్ అనే వ్యక్తి దళితులకు చెందిన భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మార్పీఎస్ నేతలు అనీల్ కుమార్ యాదవ్ పై ఆరోపణలు చేశారు. దీనిపై ఇవాళ అనీల్ కుమార్ యాదవ్ స్పందించారు. కొత్తూరులో ఆ భూమిపై కోర్టులో వివాదం నడుస్తుందని, ప్రభుత్వానికి మరో వ్యక్తి మధ్య ఈ దావా ఉందని అన్నారు. ఎలాంటి సంభందం లేని కొందరు వ్యక్తులు దళితుల పేరుతో అక్కడ గుడిసెలు వేశారన్నారు. నిజంగా అక్కడ గుడిసెలు వేసిన వారికి ఇళ్లు లేకపోతే ధరఖాస్తు చేయాలని, వారందరికీ ప్రభుత్వం తరపున తామే స్థలాలు ఇస్తామని అనీల్ కుమార్ స్పష్టం చేశారు. గుడిసెలు తొలగించాలని 20 రోజుల నుండి తాను ఆర్డీఓ, డిఎస్పీ, తహసీల్ధార్ చెబుతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదని, చివరకు జాయింట్ కలెక్టర్, ఎస్పీకి చెప్పగా స్పందించి నిన్న తొలగించారన్నారు. అంతకు ముందు ఆయన నిర్మాణంలో ఉన్న మైపాడు రోడ్డును తనిఖీ చేశారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను కోరారు.
