Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని కలెక్టరేట్ లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. రెండో శనివారం శెలవు దినం కావడంతో సిబ్బంది ఎవ్వరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో కలెక్టర్ కార్యాలయ భవనం పడమరవైపు ఉండే వాడుకలో లేని స్టోర్ రూములో అగ్నికీలలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటల పెద్దవి కావడంతో కలెక్టరేట్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రెండు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కలెక్టరేట్ లో అగ్నిప్రమాదం జరగడంతో ఎంతో విలువైన పత్రాలు కాలిపోయి ఉంటాయని అందరూ భావించారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అగ్ని ప్రమాదం జరిగిన స్టోర్ రూములో విలువైన రికార్డులు ఏమీ లేవని స్పష్టం చేశారు. ఆ స్టోర్ రూము వాడుకలోనే లేదన్నారు. అక్కడ పనికి రాని, వాడుకలో లేని ఫర్నిచర్, కుర్చీలు, టేబుళ్లు, కిటికీ ఫ్రేములు మాత్రమే ఉన్నాయని అవే కాలిపోయాయని తెలియజేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం సంభవించే అవకాశం కూడా లేదన్నారు. ఆ స్టోర్ రూముకు విద్యుత్ సౌకర్యం లేదన్నారు. చుట్టుపక్కల నుండి నిప్పు రవ్వలు వచ్చి అక్కడ పడి ఉండవచ్చునని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.
