Clock Of Nellore ( Nellore ) – అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి నెల్లూరుజిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల నుండి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. రెండు రోజులు సాధారణంగానే కురిసిన శనివారం ఉదయం నుండి ఏకధాటిగా కురుస్తోంది. ఫలితంగా ఆదివారం ఉదయం కల్లా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నెల్లూరులోని హరనాథపురం, రామలింగాపురం, కేవిఆర్ పెట్రోల్ బంకు సెంటర్, సండే మార్కెట్, డైకాస్ రోడ్డు, గాంధీ బొమ్మ సెంటర్ తదితర ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి. ఆత్మకూరు బస్టాండ్ రైల్వే అండర్ బ్రిడ్జి, రామలింగాపురం అండర్ బ్రిడ్జి, విజయమహల్ గేట్ అండర్ బ్రిడ్జి, మాగుంట లే అవుట్ అండర్ బ్రిడ్జిలు పూర్తిగా నీటితో నిండిపోగా అప్రమత్తమైన నెల్లూరు కార్పొరేషన్ అధికారులు మోటార్ల ద్వారా వర్షపు నీటి పంప్ చేసి రాకపోకలను అంతరాయం లేకుండా చేశారు. నెల్లూరులోని ఉమ్మారెడ్డి గుంట ప్రాంతంలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే కావలి పట్టణంలోని వైకుంఠపురంలో కూడా నడుములోతు నీరు చేరడంతో నీరు ఇళ్లల్లోకి చేరాయి. ముసునూరు వద్ద కూడా భారీగా ఇళ్లల్లోకి నీరు చేరడంతో స్థానికి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హుటాహుటిన అక్కడకు చేరుకుని జేసిబి సాయంతో గండి కొట్టి నీటికి లోతట్టు ప్రాంతాలకు తరలించారు. నెల్లూరు నగరంలో కమిషనర్ హరిత పర్యటించారు. భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న కాలువలను పరిశీలించి నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఇబ్బందులు ఉంటే తమకు ఫోన్ చేయాలని కోరారు. గుడ్లూరులోని ఉప్పుటేరు వాగు పొంగిపొర్లుతోంది. వాగు పొంగడంతో గుడ్లూరు – బసిరెడ్డి పాళెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మనుబోలులో హైస్కూల్ భవనం వరదనీటిలో చిక్కుకుంది. చిల్లకూరు, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేటలో కూడా భారీ వర్షం కురుస్తోంది.
