Clock Of Nellore ( Nellore ) – అవయవదానం పై అపోహలు వీడి ప్రతి ఒక్కరూ అవయవదానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ పేర్కొన్నారు. జాతీయ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జీవన్ ధాన్ సంస్థ, అపోలో, మెడికవర్, కిమ్స్, నారాయణ, ఏసీ ఎస్ ఆర్ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని వి ఆర్ సీ సెంటర్ నుంచి కస్తూరిభా కళాక్షేత్రం వరకు వాక్ థాన్ కార్యక్రమం నిర్వహించారు. నగరపాలక సంస్థ కమీషనర్ ఓ నందన్, జీవన్ ధాన్ చీఫ్ ట్రాన్స్ ప్లాంట్ కో ఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు, అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ రంజిత్ రెడ్డి, కిమ్స్ హాస్పిటల్ సీ ఈ ఓ డాక్టర్ సతీష్, నారాయణ హాస్పిటల్ ఏ జి ఎం ఏసీ శేఖర్ రెడ్డి తదితరులతో పాటు ప్రముఖ వైద్యులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ముందుకు సాగారు.
అనంతరం కస్తూరిభా కళా క్షేత్రంలో జరిగిన అవగాహనా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అవయవదానంపై అపోహలు తొలగించి, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.అవయవ దానంతో ఎంతో మంది అమూల్య మైన ప్రాణాలు కాపాడవచ్చన్నారు. అవయవ దానం యొక్క విశిష్టతను గుర్తించి ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. చీఫ్ ట్రాన్స్ ప్లాంట్ కో ఆర్డినేటర్, ఏపీ జీవన్ ధాన్ డాక్టర్ రాంబాబు, నగర పాలక సంస్థ కమీషనర్ ఓ. నందన్, అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ రంజిత్ రెడ్డి, కిమ్స్ సీ ఈ ఓ డాక్టర్ సతీష్ తదితరులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు అంగధాన్ జన జాగృతి అభియాన్ కార్యక్రమంలో భాగంగా అవయవదానంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఒక జీవన్మృతుని అవయవ దానంతో 8 మంది ప్రాణాలు కాపాడవచ్చన్నారు. అవగాహనా లోపం, మూఢ నమ్మకాలు కారణంగా ఎక్కువ మంది అవయవ దానానికి ముందుకు రావడం లేదన్నారు. అందుకే ప్రజల్లో వున్న అపోహలను తొలగించడం కోసం, అవయవ దానంతో ఎంతో మంది అమూల్యమైన ప్రాణాలు కాపాడేందుకు అన్ని వర్గాలను చైతన్య పరిచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
అందులో భాగంగా శనివారం నగరంలోని అపోలో హాస్పిటల్ లో, సాయంత్రం ఏ సీ ఎస్ ఆర్ కళాశాల హాస్పిటల్ లో వైద్యులు, నర్సులు, కో ఆర్డినేటర్లకు బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి అవయవ దానాన్ని చట్టబద్ధంగా ఏవిధంగా చేయాలి అనే అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అవయవ దానం యొక్క ప్రాధాన్యత ను గుర్తించి ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకు వచ్చి ప్రాణదాతలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి జి హెచ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె. మాధవి, అపోలో హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు, నారాయణ హాస్పిటల్ ఏజిఎం ఏసీ శేఖర్ రెడ్డి, అపోలో,మెడికవర్, నారాయణ, కిమ్స్, జి జి హెచ్ హాస్పిటల్ వైద్యులు, నర్సులు, పలువురు ప్రముఖులు, పారామెడికల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
