Clock Of Nellore ( Atmakur ) – పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరుజిల్లాలో ఆయన గురువారం సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ ద్వారా నెల్లూరుజిల్లాలోని ఆత్మకూరు బీసీ గురుకుల పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చంద్రబాబు చేరుకున్నారు. చంద్రబాబుకు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఎన్.ఎం.డి. ఫరూఖ్, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, టి.జి. భరత్, ఎంపిలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావు, జిల్లా కలెక్టర్ ఆనంద్ తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుండి ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గాన నెల్లూరు పాళెం గిరిజన కాలనీకి చేరుకున్నారు. భర్తను కోల్పోయి తల్లిదండ్రుల నివాసంలో ఉంటున్న యువతి సుస్మిత నివాసానికి వెళ్లారు. వారి యోగక్షేమాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. సుస్మితతో పాటూ వారి తల్లిదండ్రులు, తమ్ముడితో మాట్లాడారు. భర్తను కోల్పోయిన సుస్మితకు డిఎస్సీ కోచింగ్ ఇప్పించాలని జిల్లా కలెక్టర్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే ఐటిఐ చదివిన ఆమె తమ్ముడికి వ్యవసాయ అవసరాలకు వినియోగించే డ్రోన్ ఇప్పించి ఉపాధి కల్పించాలని కలెక్టర్ కు సూచించారు. సుస్మిత కుమార్తె ఐదేళ్ల చిన్నారి చేత్రికని గురుకుల పాఠశాలలో చేర్పించి విద్య నభ్యసించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కుటుంబానికి అన్నీ విధాల ప్రభుత్వ పరంగా సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. అనంతరం సుస్మితకు వితంతు పెన్షన్ ను అందజేశారు. అక్కడి నుండి గిరిజన కాలనీ వాసులను పలకరించుకుంటూ నారంపేటకు వెళ్లారు.
