Clock Of Nellore ( Nellore ) – దోమల ద్వారా వ్యాపించే అంటు వ్యాధి మలేరియా అని, మలేరియా సోకితే అప్రమత్తంగా ఉండాలని లేదంటే కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా కారణమవుతుందని నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ కన్సల్టెంట్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్స్ డాక్టర్ పెంచల ప్రసాద్, డాక్టర్ రవీంద్ర రెడ్డి, డాక్టర్ విజయకుమార్ హెచ్చరించారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మెడికవర్ హాస్పిటల్ జరిగిన అవగాహన కార్యక్రమంలో వారు పాల్గొని ప్రసంగించారు. దోమల ద్వారా వ్యాపించే మలేరియా వ్యాధి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా 6లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని చెప్పారు. సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగా ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మలేరియా బారిన పడుతున్నారని వెల్లడించారు. మలేరియా వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు డాక్టర్ పెంచల ప్రసాద్, డాక్టర్ రవీంద్ర రెడ్డి, డాక్టర్ విజయకుమార్ వెల్లడించారు. దోమ కుట్టిన 10 రోజుల తర్వాత జ్వరం, తలనొప్పి, చలి లక్షణాలతో మలేరియా బయటపడుతుందని, ఆ సమయంలో వైద్యులను సంప్రదించకుండా నిర్లక్ష్యం చేస్తే రాను రాను అలసట, మార్చపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారడం కనిపిస్తుందన్నారు. మలేరియా వ్యాధి తీవ్రమైతే కాలేయం, కిడ్నీలు, మెదడు లాంటి అవయవాలు కూడా దెబ్బతింటాయని హెచ్చరించారు. వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించి ఇంట్లోకి దోమలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. మలేరియా వ్యాధికి కారణమయ్యే అనాఫిలిస్ దోమలు కుట్టకుండా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలని, దోమతెరలను ఉపయోగించాలని సూచించారు. మలేరియాకు చికిత్స కన్నా నివారణే సులభమని, నివారణ మార్గాల ద్వారా మలేరియా సోకకుండా చూసుకోవాలన్నారు. అధిక జ్వరం, వణుకు వస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో మలేరియా వ్యాధిని పూర్తిగా నయం చేసేందుకు అనుభవజ్ఞులైన వైద్య బృందం అందుబాటులో ఉందని, మెడికవర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ పెంచల ప్రసాద్, డాక్టర్ రవీంద్ర రెడ్డి, డాక్టర్ విజయకుమార్ పిలుపునిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ ధీరజ్ రెడ్డి, ఫిజీషియన్ విభాగం వైద్యులు, సిబ్బంది, పిఆర్వో చందు వర్మ పాల్గొన్నారు.