Clock Of Nellore ( Kavali ) – పహల్గామ్ ఉగ్రదాడిలో అశువులు బాసిన నెల్లూరుజిల్లా కావలి పట్టణ వాసి సోమిశెట్టి మధుసూదన్ రావు అంత్యక్రియలు గురువారం కావలిలో జరిగాయి. మధుసూదన్ రావు భౌతిక కాయం బుధవారం అర్ధరాత్రి శ్రీనగర్ నుండి ప్రత్యేక విమానంలో చెన్నై విమానాశ్రయానికి తీసుకురాగా అక్కడ కావలి రెవెన్యూ అధికారులు భౌతిక కాయాన్ని స్వాధీనం చేసుకుని రోడ్డు మార్గంలో కావలిలోని వారి నివాసానికి తీసుకొచ్చారు. గురువారం సాయంత్రం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. అంతకు ముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు ఆనం రామ నారాయణరెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్, ఎమ్మెల్యేలు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు… మధుసూదన్ రావు మృతదేహానికి పుష్పగుచ్చాలతో నివాళి అర్పించారు. డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మృతదేహానికి నివాళి అర్పించిన అనంతరం వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ పహల్గామ్ ఘటన దురదృష్ఠకరమని అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని నిర్మూలించాలని కోరారు.
