టిడిపి ప్రభుత్వంతోనే ముస్లింల అభివృద్ధి : ఇఫ్తార్ విందులో నేతల స్పష్టీకరణ

Clock Of Nellore ( Nellore ) – రాష్ట్రంలో ముస్లింల సంక్షేమానికి ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని కస్తూరిదేవి గార్డెన్స్ లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, జిల్లా కలెక్టర్ ఆనంద్, మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిధులు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు స్వీకరించారు. ముస్లిం సోదరులకు, కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ రంజాన్ మాసంలో అనేక కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ హయాంలో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మైనార్టీ సోదరులకు అందించడం జరిగిందని, గతప్రభుత్వ పాలన లో కొంత నిర్లక్ష్యం జరిగిందన్నారు. నేడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తో చంద్రబాబు నాయుడు గారి హాయంలో ప్రతి జిల్లాలో మైనార్టీ సోదరులు ఈ పవిత్ర పండుగలో భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికి అక్కడ ఇఫ్తార్ విందులు ఘనంగా జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇమామ్ మరియు మౌజాన్లకు గౌరవ వేతనం కూడా ఇస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 441 మసీదులకు రూ. 3.96 కోట్లు నిధులు మంజూరు చేశామని, 882 మంది ముస్లిం పండితులకు 66.15 గౌరవ వేతనాలు అందించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మసీదులకు పెద్దపీట వేస్తుంది అనడం లో ఎటువంటి సందేహం లేదని, రాష్ట్రవ్యాప్తంగా ఇఫ్తార్ విందులకు ప్రభుత్వం ఇప్పటికే నిధులు కూడా విడుదల చేసిందన్నారు. 40 రోజుల ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదరుల స్ఫూర్తి, క్రమశిక్షణ అందరికీ ఆదర్శమన్నారు. అందరూ రాష్ట్ర ప్రగతి, దేశ ప్రగతిలో భాగస్వామ్యులు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ పవిత్ర రంజాన్ మాసం అనురాగం, సహనంతో కూడిన పవిత్ర సమయమని, ఇది భక్తి, పరస్పర ప్రేమ, సేవాభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సామాజిక సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి అవకాశాల్లో ముస్లిం సోదరులకు మెరుగైన అవకాశాలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది అని తెలిపారు.

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ …
ముస్లిం మైనార్టీలకు టిడిపి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. 2014- 19 లోనే 400 ఏళ్ల చరిత్ర ఉన్న బారాషహీద్ దర్గాని అభివృద్ధి చేశామని, 43వ డివిజన్లో నిరుపేద ముస్లింల శుభకార్యాల కోసం సొంత నిధులతో షాది మంజిల్ నిర్మాణం చేపట్టామని చెప్పారు. 54 వ డివిజన్లో తాను, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కలిసి 99 లక్షల అంచనాలతో మరో షాది మంజిల్ నిర్మిస్తున్నామన్నారు. నా గెలుపు కోసం ముస్లిం మైనార్టీలు అందించిన సహకారం మరువలేనిదన్నారు. ముస్లింల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక పథకాలు తీసుకొచ్చారన్నారు. రాష్ట్రంలో 5000 మంది మౌజం, ఇమామ్ లకు గౌరవ వేతనాలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రజలందరి సహకారంతో నెల్లూరు నగరాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని చెప్పారు.

రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ…
ధనవంతులు ఎంతోకొంత పేదలకు సహాయం చేయాలని ఇస్లాం స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పి4 విధానానికి శ్రీకారం చూస్తున్నట్లు చెప్పడం గర్వకారణంగా ఉందన్నారు. రాష్ట్రంలో ముస్లింల ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారని, ఆ మేరకు ముస్లింల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి అజీజ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముస్లింలందరికి ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాసరావు, ఈడి హైఫా, సూపరింటెండెంట్ రఘు, ముస్లిం మత పెద్దలు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Read Previous

సినిమా థియేటర్స్, షాపింగ్ మాల్స్ లో పార్కింగ్ ఫీజు లేదు …

Read Next

ఆరోగ్యమే మహా భాగ్యం : అవగాహన కల్పించిన మెడికవర్ వైద్యులు

Leave a Reply

Your email address will not be published.