నెల్లూరుజిల్లా అభివృద్ధిపై కలెక్టర్ సమగ్ర నివేదిక : అంగీకరించిన సిఎం చంద్రబాబు

Clock Of Nellore ( Amaravati ) – నెల్లూరు జిల్లాలో సుదీర్ఘకాలంగా మూతబడి వున్న కోవూరు చక్కెర కర్మాగారానికి సంబంధించి బకాయిలు చెల్లించి ఫ్యాక్టరీ స్థలాన్ని ఎపిఐఐసికు అప్పగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం అమరావతి సచివాలయంలో రెండోరోజు కలెక్టర్ల సదస్సులో జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ జిల్లా సమగ్రాభివృద్ధి, భవిష్యత్‌ ప్రణాళికపై పవర్‌ ప్రజంటేషన్‌ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ జిల్లాలోని పలు ప్రధాన అంశాలను సీఎంకు వివరించారు. ముఖ్యంగా కోవూరు చక్కెర కర్మాగారం, జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌, సోమశిల అభివృద్ధి, జిల్లాలో గృహనిర్మాణాల పురోగతి అంశాలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. జిల్లాలో గత పదేళ్లకు పైగా కోవూరు చక్కెర కర్మాగారం మూతబడి వుందని, నెల్లూరుకు సమీపంలో పెన్నానది ఒడ్డున ఉన్న ఈ ఫ్యాక్టరీకి చెందిన 124 ఎకరాల భూమిని పరిశ్రమల స్థాపనకు ఎపిఐఐసికు అప్పగించేందుకు అనుమతి మంజూరు చేయాలని సీఎంకు విన్నవించారు. రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కూడా ఈ ఫ్యాక్టరీకి సంబంధించి చక్కెర రైతులు, కార్మికులకు 28 కోట్లు బకాయిల విషయమై సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు స్పందించిన సీఎం బకాయిలు చెల్లించి, పరిశ్రమల స్థాపనకు భూమిని ఎపిఐఐసికి అప్పగించాలని జిల్లా ప్రత్యేకాధికారి, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌ను ఆదేశించారు.

జిల్లాలో 288 కోట్లతో చేపట్టిన జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం దాదాపు పూర్తయిందని, త్వరగా ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్‌ సీఎంను కోరగా, వెంటనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా ప్రత్యేకాధికారి, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌ను సీఎం ఆదేశించారు. సోమశిల జలయాశాన్ని తమరు ఇటీవల సందర్శించి అభివృద్ధి పనులు మొదలుపెట్టాలని ఆదేశించారని, ఆ మేరకు పనులు మొదలుపెట్టినట్లు కల్టెకర్‌ సీఎంకు తెలిపారు. సోమశిల ఆఫ్రాన్‌ పనులు, హైలెవల్‌ కెనాల్‌ పనులకు నిధులు కేటాయించాలని కలెక్టర్‌ సీఎంను కోరగా, ఈ విషయమై ఇరిగేషన్‌ అధికారులు తనతో ప్రత్యేకంగా చర్చించి సోమశిల పనులు వేగవంతం చేయాలని సీఎం ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో సుమారు 10924 ఇళ్ల నిర్మాణాలు విజిలెన్స్‌ విచారణతో నిలిచిపోయాయని, ఈ ఇళ్ల నిర్మాణాల పూర్తికి అనుమతించాలని సీఎంను కలెక్టర్‌ కోరగా, అవసరమైన చర్యలు తీసుకోవాలని హౌసింగ్‌ అధికారులను సీఎం ఆదేశించారు.

జిల్లాలో సుమారు 163 కి.మీ. సముద్రతీర ప్రాంతం వుందని, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టులతో పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. పర్యాటకంగా జిల్లాలో మూడు ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ చెప్పారు. రామాయపట్నం పోర్టు వద్ద పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఇఫ్కో కిసాన్‌ సెజ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు కొన్ని కంపెనీలు ముందుకొచ్చినట్లు చెప్పారు. బిట్రగుంట వద్ద ఎంఎంఎల్‌పి రైల్వే ప్రాజెక్టు ఏర్పాటుకు 500 ఎకరాల భూమి సేకరణ చేస్తున్నట్లు తెలిపారు. తమిళనాడు జాలర్ల అక్రమ ప్రవేశాలు, జాలర్లపై దాడుల సమస్యను కలెక్టర్‌ సీఎంకు వివరించారు. జిల్లాలో ఎస్‌సి, బీసీ, మైనార్టీ కార్పొరేషన్‌ రుణాలు, ఎస్టీలకు ఆధార్‌ కార్డులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు తక్కువ ధరలలో అభివృద్ధి చేసిన ప్లాట్లను అందించేందుకు నుడా పరిధిలో 200 ఎకరాల్లో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్ల ఏర్పాటు, అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లాలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 15శాతం వృద్ధి నమోదుకు తయారుచేసిన యాక్షన్‌ ప్లాన్‌ను కలెక్టర్‌ తన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌లో సీఎంకు వివరించారు.

Read Previous

ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు ఎమ్మెల్యే కోటంరెడ్డి భారీ సత్కారం

Read Next

సినిమా థియేటర్స్, షాపింగ్ మాల్స్ లో పార్కింగ్ ఫీజు లేదు …

Leave a Reply

Your email address will not be published.