Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని జి.ఎన్.టి ప్రధాన రోడ్డులో నిర్మించిన 6 ఏసి బస్ షెల్టర్లలో అన్ని సదుపాయాలను కల్పించి ప్రయాణికులకు త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ సూర్య తేజ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్, విఆర్సీ సెంటర్ జంక్షన్, శబరీ శ్రీరామ క్షేత్రం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, కరెంటు ఆఫీస్ జంక్షన్, అయ్యప్ప గుడి సెంటర్ ప్రాంతాలలోని ఏసీ బస్సు షెల్టర్లను కమిషనర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని బస్టాండ్లలో ఏసీ సదుపాయాన్ని కల్పించాలని, సోలార్ ప్యానల్ ద్వారా విద్యుత్ సౌకర్యాన్ని అందించాలని సూచించారు. బస్ షెల్టర్లకు అవసరమైన మరమ్మతు పనులను పూర్తి చేసి, బోర్డులు పెయింటింగ్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
బస్సు షెల్టర్లకు సమీపంలో దుకాణాలు, వీధి వ్యాపారస్తులు, ఇతర ఆక్రమణలకు గురి కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీసీ బస్సులు బస్సు షెల్టర్ల వద్ద ఆగేలాగా రవాణా శాఖ అధికారులకు తెలియజేయాలని కమిషనర్ సూచించారు. బస్సు షెల్టర్లలో రోడ్డు రవాణా సౌకర్యం కోసం ఎదురుచూసే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రామ్మోహన్ రావు, ఏ.ఈ అర్చిత, వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు, వార్డు అమెనిటీస్ కార్యదర్శులు, వార్డు ప్లానింగ్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
