
- నెల్లూరు అపోలో హాస్పిటల్ లో కొలరెక్టల్ క్యాన్సర్ పై అవగాహన
- అవగాహన కార్యక్రమంలో మాట్లాడిన డాక్టర్ శ్రీరామ్ సతీష్
- కార్యక్రమంలో పాల్గొన్న క్యాన్సర్ వైద్య బృందం
- యువతకు ఎక్కువగా కొలరెక్టల్ క్యాన్సర్ వస్తుందని వెల్లడి
- ముందుగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచన
Clock Of Nellore ( Nellore ) – సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే కొలరెక్టల్ క్యాన్సర్ ( పెద్దప్రేగు సంబంధ క్యాన్సర్ )ను జయించవచ్చునని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ అన్నారు. నెల్లూరులోని అపోలో హాస్పిటల్ లో బుధవారం కొలరెక్టల్ క్యాన్సర్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. డాక్టర్ శ్రీరామ్ సతీష్ నేతృత్వంలో నిర్వహించిన ఈ సదస్సులో హాస్పిటల్ కు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ హరిత, ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ నితీష్ కుమార్ రెడ్డి, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ హిమబింధు పాల్గొని డాక్టర్ శ్రీరామ్ సతీష్ తో కలిసి కొలరెక్టల్ క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. ఆధునిక జీవనశైలి కారణంగా ఇటీవల ఎక్కువగా కొలరెక్టల్ క్యాన్సర్ ( పెద్దప్రేగు సంబంధ క్యాన్సర్ ) యువతకు ఎక్కువగా సోకుతుండటం బాధాకరమన్నారు. యువత ఆధునిక పోకడలకు అలవాటు పడకుండా, ఆరోగ్యకరమైన జీవనశైలిలో ముందుకెళితే ఇలాంటి క్యాన్సర్లకు దూరంగా ఉండవచ్చునని చెప్పారు. పెద్దప్రేగులోని ఏదో ఒక భాగంలో పుండుగా ఈ క్యాన్సర్ ప్రారంభమవుతుందన్నారు. మలంలో రక్తం రావడం, ఎక్కువగా బరువు తగ్గిపోవడం, నిరంతరం కడుపునొప్పిగా ఉండటం, వాంతులు అవుతుండటం… కొలరెక్టల్ క్యాన్సర్ కు లక్షణాలని గుర్తించాలని సూచించారు. అలాంటి లక్షణాలు ఉన్న వెంటనే వైద్యులను సప్రందించి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించుకుని, వెంటనే చికిత్సను ప్రారంభిస్తే కొలరెక్టల్ క్యాన్సర్ ను పూర్తిగా జయించవచ్చునని వైద్యులు పేర్కొన్నారు. కొలరెక్టల్ క్యాన్సర్ నివారణకు అపోలో హాస్పిటల్స్ సంస్థ భారతదేశ వ్యాప్తంగా కృషి చేస్తుందని, అందులో భాగంగా దేశంలోని అన్నీ అపోలో హాస్పిటళ్లలో కొలరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను, చికిత్సలను తక్కువ ఫీజులతోనే చేస్తుందని తెలియజేశారు. నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో కూడా కొలరెక్టల్ క్యాన్సర్ కు అధునాతన పద్దతుల్లో చికిత్స అందుబాటులో ఉందన్నారు. రోబోటిక్ విధానంతో పాటూ ఎండోస్కోపిక్ సబ్ మ్యూకోసల్ డిసెక్షన్, టోటల్ నియోఅడ్జువాంట్ థెరపీ పద్దతుల్లో క్యాన్సర్ చికిత్స చేస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.ఈ విలేకరుల సమావేశంలో హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.