Clock Of Nellore ( Nellore ) – ఆస్తి పన్నుపై వడ్డీలో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉత్తర్వులను జారీ చేసిందని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు తోడు పేరుకుపోయిన కోట్లాది రూపాయల మొండి బకాయిల వసూళ్ల కోసం రాయితీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కమిషనర్ తెలియజేశారు. ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆస్తి పన్ను బకాయిదారులంతా ఈ నెలాఖరులోపు బకాయిలను చెల్లించి, రాయితీ వెసులుబాటును పొందాలని కమిషనర్ సూచించారు. ఈ మేరకు జీవో ఉత్తర్వులను కమిషనర్ వివరించారు. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో ఇంటిపన్ను, ఖాళీ స్థలాలపై పన్నులు సకాలంలో అనగా మొదటి అర్థసంవత్సరానికి జూన్ నెలఖారులోపు మరియు రెండవ అర్ధసంవత్సరానికి డిసెంబర్ నెలాఖరులోపు పన్ను చెల్లించనియెడల 2% వడ్డీతో కలిపి చెల్లించవలసి ఉంటుంది. అయితే పన్ను చెల్లింపుదారుల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మరియు పురపాలకసంఘాలలో పేరుకుపోయిన పన్ను బకాయిల వసూలు మెరుగుపరుచుటకు, ఆస్తిపన్ను మరియు ఖాళీ స్థలాల పన్ను బకాయిలను 31.03.2025 లోపు ఒకేసారి ఏకమొత్తంలో చెల్లింపు చేసినట్లయితే, అట్టి చెల్లింపుదారులకు వడ్డీ 50% రాయితీని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో. ఎంఎస్ఎం నెం. 46 ను తేదీ: 25.03.2025 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఆదేశాల ప్రకారం ఆస్తి మరియు ఖాళీ స్థలాల పన్ను బకాయిలను అనగా ఈ ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న బకాయిలు (arrear) మరియు ఈ ఆర్థిక సంవత్సరం పన్ను బకాయిలను (current), 50% వడ్డీతో 31.03.2025 లోపు ఒకేసారి ఏకమొత్తంలో చెల్లించి మిగతా 50% వడ్డీ రాయితీని పొందవచ్చు. ఈ సదుపాయం ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటికే పన్ను బకాయిలు లేకుండా వడ్డీతో పాటు చెల్లించిన వారందరికీ కూడా వర్తించును, సదరు వడ్డీలో 50% రాబోవు ఆర్థిక సంవత్సర పన్నులకు జమ కాబడును. కావున ప్రభుత్వం వారు కల్పించిన ఈ సదవకాశాన్ని రాష్ట్రం లో గల అన్ని మునిసిపల్ కార్పొరేషన్స్, మునిసిపాలిటీలు మరియు నగర పంచాయతీలలో గల ప్రజలు వినియోగపరుచుకొని మీ యొక్క ఆస్తి మరియు ఖాళీ జాగా పన్ను బకాయిలని 50% వడ్డీతో ఒకే సారి తేది. 31.03.2025 లోపు చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధిలో పాలు పంచుకోవాలిసిందిగా కోరడమైనది. ఇప్పటిదాకా వడ్డీతోపాటు కలిపి ఆస్తి పన్నులు చెల్లించిన యజమానులకు రాబోవు అర్ధ సంవత్సరమునకు ఇంటి పన్ను యందు 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను సర్దుబాటు అవుతుందని తెలియజేశారు.