Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆదివారం చేపట్టబోయే 105 అభివృద్ధి పనుల శంఖుస్థాపనల కార్యక్రమానికి ప్రజలే అతిధులని, ప్రారంభకులు కూడా వారేనని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నెల్లూరులోని వారి కార్యాలయంలో కోటంరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి కార్యక్రమ వివరాలను తెలియజేశారు. ఆదివారం ఉదయం 6.30 గంటలకు శంఖుస్థాపనల కార్యక్రమం మొదలవుతుందని చెప్పారు. రాత్రి వరకూ జరిగే ఈ కార్యక్రమాల్లో భాగంగా మొత్తం 105 అభివృద్ధి పనులకు ప్రజలతో శంఖుస్థాపనలు చేయిస్తామన్నారు. కొన్ని శంఖుస్థాపన కార్యక్రమాల్లో తానూ, మరి కొన్ని కార్యక్రమాల్లో తన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మరి కొన్ని చోట్ల మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, టిడిపి ముఖ్య నేతలు పాల్గొంటారని చెప్పారు. శంఖుస్థాపనలు జరిగే కార్యక్రమాల్లో ఆయా ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోటంరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కార్యక్రమం తర్వాత ఈనెల 17వ తేదీనా మరో 198 చోట్ల శంఖుస్థాపనలు ఉన్నాయని, మొత్తం 303 అభివృద్ధి కార్యక్రమాల పనులను 60 రోజుల్లో పూర్తి చేసి మే 20వ తేదీనా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 26 డివిజన్లలో చేసే ఈ అభివృద్ధి పనులకు 40 కోట్లు వెచ్చించినట్లు, 18 గ్రామాలతో కలిపి మొత్తం విలువ 191 కోట్లు అని వెల్లడించారు. ఇప్పటి వరకూ ఎవ్వరూ చేయని పనిచేసే అదృష్ఠాన్ని తనకు కల్పించిన భగవంతునికి, రూరల్ నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, మంత్రి నారా లోకేష్ కు, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి పొంగూరు నారాయణకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు కోటంరెడ్డి తెలిపారు.