Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు వేస్తున్న ఫ్లోర్ పాయింట్లను గుర్తించి, ఆయా ప్రాంతాలను శుభ్రపరిచి అక్కడ పూల మొక్కల కుండీలను ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని కమిషనర్ సూర్య తేజ ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా మంగళవారం 43వ డివిజన్ కోటమిట్ట, జెండా వీధి, కుమ్మరి వీధి, ఫిష్ మార్కెట్ తదితర ప్రాంతాలలో కమిషనర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటమిట్ట షాది మంజిల్ ప్రాంతం నుంచి ఏర్పాటు చేసి ఉన్న డివైడర్ పై మొక్కలకు ట్రిమ్మింగ్ చేసి డివైడర్లు శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రైను కాలువల్లో పూడికతీత అనంతరం రోడ్లపై సిల్టును ఉంచరాదని, ఎప్పటికప్పుడు తరలించేయాలని ఆదేశించారు. ప్రధానమైన ప్రాంతాల్లో వ్యర్ధాలు వేయకుండా పూల మొక్కల కుండీలను ఫెన్సింగ్ తో పాటు ఏర్పాటు చేసినందుకు స్థానిక శానిటేషన్ సెక్రటరీ, శానిటేషన్ ఇన్ స్పెక్టర్లను కమిషనర్ ప్రశంసించారు. ప్రతి సచివాలయ సెక్రెటరీకి 100 పూలకుండీల మొక్కలను అందజేసి వారి డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసుకొనెలా, మొక్కలకు రక్షణ కల్పించేలా ఫెన్సింగ్, క్రమం తప్పకుండా నీటిని పోసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ను కమిషనర్ సూచించారు.
స్థానిక చేపల మార్కెట్ సమీపంలోని సబ్ స్టేషన్ వద్ద ఉన్న ఐలాండ్ లో గతంలో సూచించిన విధంగా పచ్చ దనాన్ని మెరుగుపరిచి అందంగా తీర్చిదిద్దారని, ఇదేవిధంగా మరికొన్ని ప్రాంతాలను గుర్తించి ఐలాండ్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం స్థానిక ఫిష్ మార్కెట్ సమీపంలోని అన్నా క్యాంటీన్ ను కమిషనర్ సందర్శించి ప్రజలకు అందుతున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. క్యాంటీన్లోని వాటర్ ప్లాంట్ ను క్రమం తప్పకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరికి టోకెన్ విధానం ద్వారానే ఆహారాన్ని అందించాలని నిర్వాహకులకు కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, వెటర్నరీ డాక్టర్ మదన్మోహన్, ఇంజనీరింగ్ విభాగం ఈ.ఈ, సచివాలయ సెక్రటరీలు సిబ్బంది పాల్గొన్నారు.
