Clock Of Nellore ( Nellore ) – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ అసమర్థత, సమన్వయ లోపంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలుపొందిన అనేక మంది పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడిందని నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరులోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో విసిగెత్తిపోయి తెలుగుదేశం పార్టీలో చేరామన్నారు. మరి కొంతమంది టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చారన్నారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేరళ జడ్జిమెంట్ ను పదే పదే చెబుతున్నారని, ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు చట్టాలు చేసుకునే వెసులుబాటు ఉందన్న సంగతి కాకాణి తెలుసుకోవాలన్నారు. మీడియా సమావేశంలో మీ పక్కన కూర్చున్న కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికై రెండు నెలలు కాకాముందే ఆనాటి అధికార కాంగ్రెస్ పార్టీతో జత కలిసిన విషయాన్ని మర్చిపోయారా అని ధ్వజమెత్తారు. కార్పొరేషన్ లో 54 మంది కార్పొరేటర్లకు గాను దాదాపు 40 మంది కార్పోరేటర్లు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారంటే ఇది మీ అసమర్థత కాదా అంటూ ప్రశ్నించారు. నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్, కోవూరు నియోజకవర్గాల్లో చరిత్ర సృష్టించే విధంగా మెజారిటీలు తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో సాధించిందన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకే తాము పని చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ సయ్యద్ తహసీన్, సీనియర్ నాయకులు దార్ల వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు షేక్ అస్మా, దేవరకొండ సుజాత, గోగుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.