గత ప్రభుత్వ పాపం… ప్రజలకు శాపం… మండిపడ్డ మంత్రి ఆనం

Clock Of Nellore ( Chejarla ) – గత ప్రభుత్వం విస్మరించిన అన్ని రహదారులకు మరమ్మతులు చేపట్టి ఏ ఒక్క రోడ్డుపై కూడా గుంటలు లేకుండా ప్రజలందరూ సాఫీగా ప్రయాణం చేయడమే గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల మండలం, మాముడూరు గ్రామంలో మిషన్ పాట్ హోల్ ఫ్రీ (గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్) కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. గుంటల మయమైన రోడ్డుపై కంకర చిప్స్ వేసి గుంతలను పూడ్చే పనులను స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదేళ్లలో ధ్వంసం చేసిన రోడ్లను మనకు ఆస్తిగా ఇచ్చి వెళ్ళిందని, అటువంటి రోడ్లను బాగు చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టడం శుభపరిణామంగా మంత్రి చెప్పారు. గత ఐదేళ్లలో ఏ ఒక్క రోడ్డును కూడా పట్టించుకున్న దాఖలాలు లేవని, ఆత్మకూరు నియోజకవర్గంలో గత పదేళ్లుగా ఎమ్మెల్యేలుగా పని చేసిన వారు ఈ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో రోడ్ల మరమ్మతులు చేయకపోవడంతో రోడ్లపై వెళ్లాలంటేనే ప్రయాణికులు హడలిపోయారని, అంతలా రోడ్లు దెబ్బతిన్నాయని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం ధ్వంసం చేసిన రోడ్లను బాగు చేసి ప్రజలందరూ సాఫీగా ప్రయాణించేందుకు తమ ప్రభుత్వం పాట్ హోల్ ఫ్రీ ఏపీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి చెప్పారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిని మెరుగుపరుస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రోడ్లపై పడిన గుంటలు పూడ్చేందుకు కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మంత్రి చెప్పారు.

ఆత్మకూరు నియోజకవర్గంలో రూ. 3.47 కోట్ల తో 15 ఆర్ అండ్ బి రోడ్డు పనులను మొదలుపెట్టినట్లు మంత్రి వివరించారు. మరో 30 కోట్లతో ఆర్ అండ్ బి అధికారులు పనులను ప్రతిపాదించినట్లు చెప్పారు. వచ్చే మార్చి 31 లోగా ఆత్మకూరు నియోజకవర్గంలో 70 కోట్లతో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి రహదారుల మరమ్మత్తు పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని మంత్రి వివరించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా మొదటి ప్రాధాన్యతగా రోడ్లపై ఉన్న గుంటలను సంక్రాంతిలోగా పూడ్చేందుకు చర్యలు చేపట్టామని, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నూతన రహదారుల నిర్మాణాన్ని మొదలు పెడతామని మంత్రి స్పష్టం చేశారు. తన హయాంలో గొల్లపల్లి దగ్గర ఆగిన రోడ్డు నిర్మాణాన్ని తిరిగి తానే మొదలు పెడతానని, సంగం బ్యారేజ్ వరకు డబుల్ లైన్ రోడ్డు నిర్మించేందుకు కృషి చేస్తానని మంత్రి చెప్పారు. అలాగే వీర్ల గుడిపాడు బొగ్గెరు వాగు పై వంతెన నిర్మించి జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా, సంగం గ్రామంలోని ఆర్ అండ్ బి రహదారికి సైడ్ కాలువలు, రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయమని అధికారులను ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. ఆత్మకూరు నియోజకవర్గాన్ని మరోసారి అభివృద్ధి చేసేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో ఆత్మకూరును ముందంజలో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి వివరించారు. గ్రామాల్లోని సర్పంచులు కూడా తమ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, గ్రామాల అభివృద్ధికి సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు.

తొలుత మాముడూరు గిరిజన కాలనీలో సిమెంట్ రోడ్డు కు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలోని వినాయకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన రోడ్ షోలో పాల్గొన్నారు. స్థానిక గ్రామస్తులందరూ మంత్రికి అపూర్వ స్వాగతం పలికారు. గిరిజన కాలనీలో మహిళలు తమకు రామాలయాన్ని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయగా, సానుకూలంగా స్పందించిన మంత్రి రామాలయాన్ని మంజూరు చేసి, నిర్మాణ పనులను సంక్రాంతి నుంచి మొదలుపెట్టేలా కృషి చేస్తామని చెప్పారు. అలాగే మరో సిమెంట్ రోడ్డును కూడా గ్రామానికి మంజూరు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ ఈ గంగాధర్, ఆత్మకూరు ఆర్డీవో పావని, స్థానిక ప్రజా ప్రతినిధులు బొల్లినేని గిరినాయుడు తదితరులు పాల్గొన్నారు.

  • Mission Pot hole Free
  • AP Roads Repair Programme

Read Previous

ఈనెల 21 నుండి సాగునీటి సంఘాల ఎన్నికలు : వివరాలు వెల్లడించిన అధికారులు

Read Next

అమెరికాలో మంత్రి లోకేష్ కు వీడ్కోలు పలికిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల

Leave a Reply

Your email address will not be published.