
Clock Of Nellore ( Nellore ) – జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తానని ఎస్పీ జి. కృష్ణకాంత్ స్పష్టం చేశారు. బదిలీల్లో భాగంగా నెల్లూరుజిల్లా ఎస్పీగా నియమితులైన కృష్ణకాంత్… సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కార్యాలయానికి చేరుకున్న కృష్ణకాంత్ కు పోలీసులు గౌరవ వందనం చేశారు. తరువాత తన ఛాంబర్ కు చేరుకున్న కృష్ణకాంత్, జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించి మాట్లాడారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 100 రోజుల గంజాయి నిర్మూలన విధానంలో భాగంగా జిల్లాలో పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. మహిళలపై జరిగే నేరాల నిర్మూలనపై ప్రత్యేక దృష్ఠి సారిస్తామని, నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ కృష్ణకాంత్ తెలియజేశారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, సమస్యలు ఉంటే నేరుగా తనకే తెలియజేయవచ్చునని ప్రజలకు సూచించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం అదనపు ఎస్పీ సౌజన్య, జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు, పోలీసు కార్యాలయ సిబ్బంది కృష్ణకాంత్ కు పుష్పగుచ్చాలు సమర్పించి శుభాకాంక్షలు తెలియజేశారు.