
Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు కలెక్టరేట్‌లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ… రొట్టెల పండుగ నిర్వహణపై కలెక్టర్ ఆనంద్‌తో పాటు అన్నీ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన నెల్లూరు బారాషహీద్ దర్గాలో ఈ నెల 17వ తేదీ నుంచి వారం రోజుల పాటు నిర్వహించే రొట్టెల పండుగ ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. అధికారులు నిరంతర పర్యవేక్షణలో రొట్టెలపండుగను విజయవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో నిండుకున్న నెల్లూరులోని బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికి సుపరిచితమేనన్నారు. 17వ తేదీ నుంచి సుమారు వారం రోజుల పాటు రొట్టెల పండుగ కనీవినీ ఎగురని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. ఈ పండుగను దాదాపుగా 20 లక్షల మందికి పైబడి బారాషహీద్ దర్గా సందర్శనకు విచ్చేస్తారని చెప్పారు. కులమతాలకతీతంగా అందరు విచ్చేసి స్వర్ణాల చెరువులో కోరిన కోర్కెలు తీరేందుకు రొట్టెలు పట్టుకోవడం… తర్వాత సంవత్సరంలో వచ్చి కోరిన కోర్కె తీరిన అనంతరం మళ్లీ రొట్టెలు వదలడం గత 400 సంవత్సరాలకు పైబడి నుండి ఎంతో భక్తిశ్రద్ధలతో జరుగుతుందన్నారు. ఏడాదికేడాది భక్తుల సంఖ్య పెరుగుతుందంటే అది వారి నమ్మకమని చెప్పారు.
2014 నుంచి 2019 వరకు తాను మంత్రిగా ఉన్న సమయంలో ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. 2014 ఏడాదికి ముందు అధ్వానంగా ఉన్న స్థితిలో నుండి అప్పుడు మేయర్‌గా ఉన్న అబ్దుల్ అజీజ్ చొరవతో బారాషహీద్ దర్గాను ఎంతో డెవలప్‌మెంట్ చేసినట్లు చెప్పారు. దర్గాలో శాశ్వతంగా మరుగుదొడ్ల ఏర్పాట్లు, వసతుల కల్పన ఆ సమయంలోనే చేపట్టామన్నారు. దీంతో రొట్టెల పండుగ సమయంలో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వస్తుందని నారాయణ తెలియజేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ నిర్వహణపై అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నామని తెలిపారు. వచ్చే భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా సంపూర్ణ చర్యలు తీసుకుంటున్నామని, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. మరుగుదొడ్ల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య శిబిరాలు, ఎలక్ట్రసిటీ, ఫైర్ అధికారుల పర్యవేక్షణ, దివ్యాంగుల సౌలభ్యంగా ఏర్పాట్లు, స్వచ్ఛంధసంస్థల వారు భోజనాలు ఏర్పాటు చేస్తే వారికి వసతుల కల్పన, తదితర అంశాలపై కలెక్టర్‌తో పాటు అన్నీ శాఖల అధికారులతో మాట్లాడినట్లు మంత్రి నారాయణ తెలియజేశారు. బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగకు సంబంధించి 95 శాతం మేర పనులన్నీ పూర్తయ్యాయని, మిగిలిన 5 శాతం కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.