
Clock Of Nellore ( Nellore ) – డయేరియా వ్యాధి ప్రబలకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో గడప గడపకు పర్యటించి తాగునీటి శుద్ధతపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని కమిషనర్ వికాస్ మర్మత్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు, జిల్లా కలెక్టర్ సూచనల మేరకు నగర పాలక సంస్థ ఇంజనీరింగ్, ప్రజారోగ్యం విభాగాల అధికారులు, సచివాలయం వివిధ విభాగాల కార్యదర్శులతో ” డయేరియా నివారణ” అంశంపై సమీక్షా సమావేశాన్ని కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డయేరియా లక్షణాలను గుర్తించిన ప్రాంతాల్లో తాగునీటి ప్రమాణాలను పరీక్షించాలని సూచించారు. కలుషిత నీటి సరఫరాను పునరుద్ధరించడానికి ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని ఆదేశించారు. నగర పాలక సంస్థ పరిధిలో అన్ని డివిజనుల్లో క్రమం తప్పకుండా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నుంచి సరఫరా అయ్యే తాగునీటి ప్రమాణాలను పరీక్షించి నివేదికలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాలని సూచించారు.
వాటర్ ట్యాంకులను ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయడం, వివరాలు నమోదు చేయడం, తాగునీటిలో క్లోరినైజేషన్ ప్రక్రియను క్రమం తప్పకుండా అమలు చేయడం, ట్యాంకు పరిసరాలను బ్లీచింగ్ చేయడం, తాగునీటి సరఫరాలో లీకేజీలు గుర్తించి తగిన రిపేర్లు చేయడం, డ్రైను కాలువలకు సమాంతరంగా ఉన్న తాగునీటి లైన్లను గుర్తించి పునరుద్ధరించే చర్యలను తీసుకునేలా కమిషనర్ ఆదేశించారు. గడప గడపకు తిరిగి తాగునీటి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, నీటిని వేడి చేసి చల్లార్చిన తర్వాతే స్వీకరించాలని ప్రజలకు అవగాహన పెంచాలని తెలిపారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, చేతులను క్రమం తప్పకుండా పరిశుభ్రం చేసుకోవడం వంటి చర్యలను అలవాటు చేసుకునేలా చైతన్య పరిచేలా అవగాహన పెంచాలని కమిషనర్ ఆదేశించారు. పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని యూనిట్ గా చేస్తూ సచివాలయం అమెనిటీస్, హెల్త్ కార్యదర్శులను బృందంగా ఏర్పాటు చేసి డయేరియా లక్షణాల ఇంటింటి వివరాలను గుర్తించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నగర వ్యాప్తంగా ఉన్న ప్రజా మరుగుదొడ్ల నిర్వహణపై ఇంజనీరింగ్ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ పరిశుభ్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో ఇంజనీరింగ్ ఎస్.ఈ సంపత్ కుమార్, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ,రమేష్, సిటీ ప్లానర్ దేవీ కుమారీ, జిజియా బాయి, మెడికల్ ఆఫీసర్లు, ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగం అధికారులు, సచివాలయం అమెనిటీస్, హెల్త్ విభాగం కార్యదర్శులు పాల్గొన్నారు.