ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ మోసగాడు : తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వై.వి. రామిరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతిలో ఓటమి చెందిన ఆదాల ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఆయన అనుచరుడు, వైసీపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వై.వి. రామిరెడ్డి. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ మోసగాడు అని, పెద్ద మనిషి ముసుగు వేసుకున్న ఓ నయవంచకుడని విమర్శించారు. బుధవారం దానికి సంభందించి ఓ లేఖను రామిరెడ్డి స్వయంగా విడుదల చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ప్రజా నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని కొనియాడారు. అంతే కాకుండా ఆయన తనకు గత 40 ఏళ్ల నుండి మిత్రుడని గుర్తు చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై గత 16 నెలలుగా తనతో ఆదాల ప్రభాకర్ రెడ్డి దుష్ ప్రచారం చేయించారని, వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడే కుట్ర చేశారన్నారు. కోటంరెడ్డిపై దుష్ ప్రచారం చేయడం మంచిది కాదని తాను అనేక మార్లు ఆదాల ప్రభాకర్ రెడ్డికి చెప్పినా… వినకపోగా… అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనను భయబ్రాంతులకు గురిచేశారని వైవీ రామిరెడ్డి లేఖలో ఆరోపించారు. ప్రస్తుతం తనకు జ్ఞానోదం అయిందని, లేఖ ద్వారా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని బహిరంగ క్షమాపణలు కోరుతున్నట్లు రామిరెడ్డి పేర్కొన్నారు. తన కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గాలికి వదిలేసి ఆదాల ప్రభాకర్ రెడ్డి పరారయ్యాడని, ఆయన రాజకీయాలకు అర్హుడు కాదని వైవీ రామిరెడ్డి విమర్శలు చేశారు. 

Read Previous

సాధారణ వ్యక్తిగా రైల్లో ప్రయాణించిన హోం మంత్రి అనిత

Read Next

మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డిని కలిసిన మెడికవర్ ప్రతినిధులు

Leave a Reply

Your email address will not be published.