Clock Of Nellore ( Nellore ) – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరో సారి గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్తే ఉండదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. పవిత్రమైన రాష్ట్ర సచివాలయాన్ని అప్పు కోసం తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… భవిష్యత్తులో దేనికైనా తెగిస్తారని పేర్కొన్నారు. నెల్లూరులో జరిగిన బిజేపి బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో మధ్యప్రదేశ్ మాజీ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు. కాదేది కవితకు అనర్హం అన్నట్లు అప్పు కోసం దేవాలయం లాంటి రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టు పెట్టారని మండిపడ్డారు. మరో సారి వైసీపిని గెలిపిస్తే రాష్ట్రానికి భవిష్యత్తే ఉండదని స్పష్టం చేశారు. త్వరలో జరిగే ఎన్నికల్లో వైసీపిని ఇంటికి పంపాలని బిజేపి శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం మధ్యప్రదేశ్ మాజీ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ఏపిలో బిజేపి మద్దుతుతో కూడిన ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెప్పారు. ఏపిలో అన్నీ స్కాంలేనని పేర్కొన్నారు. భూ మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా కొనసాగుతుందని విమర్శించారు. హింధూ ధర్మంపై ఏపిలో దాడి సాగుతుందని ఆరోపించారు. కేంద్రం అనేక పథకాల ద్వారా రాష్ట్రానికి సాయం చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్ ఆయా పథకాలకు తన పేర్లు పెట్టుకుని తానే స్వయంగా ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి వచ్చే ఎన్నికల్లో వైసీపిని ఓడించాలని బిజేపి కార్యకర్తలకు శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు.
