రవాణా అధికారుల ఫిర్యాదు మేరకే కేసు, తనీఖీలు : వివరణ ఇచ్చిన ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – జిల్లా రవాణా శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసి, నారాయణ విద్యా సంస్థలకు సంబంధం ఉన్న వారి నివాసాల్లో సోదాలు నిర్వహించామని నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి వివరణ ఇచ్చారు. సోమవారం తనిఖీల అనంతరం ఆయన ఎస్పీ కార్యాలయంలో జిల్లా రవాణా శాఖ అధికారి చందర్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. నారాయణ విద్యా సంస్థలకు సంబంధించిన వాహనాల రిజిస్ట్రేషన్ లో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని జిల్లా రవాణా శాఖ అధికారులు బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఆ ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసి, పలువురి నివాసాల్లో తనిఖీలు చేపట్టామన్నారు. నారాయణ విద్యా సంస్థలకు… ఎన్ – స్పైరా మేనేజ్ మెంట్ సర్వీసెస్ అనే మరో సంస్థ కాంట్రాక్ట్ పద్దతిన వివిధ సేవలను అందిస్తుంటుందని చెప్పారు. ఎన్ – స్పైరా సంస్థ నారాయణ బంధువు అయిన పునీత్ అనే వ్యక్తిది అని వెల్లడించారు.

గత ఏడాది ఎన్ – స్పైరా సంస్థ 92 వాహనాల కొనుగోలుకు ఇన్ వాయిస్ తీసుకుని, నకిలీ పత్రాలతో ఆ 92 వాహనాలను నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. వాస్తవానికి 92 వాహనాలు ఎన్ – స్పైరా సంస్థ పేరుతో రిజిస్టర్ కావాలని పేర్కొన్నారు. అయితే రిజిస్ట్రేషన్ ఛార్జీల రాయితీ కోసం ఫోర్జరీ డాక్యుమెంట్లతో నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి వెల్లడించారు. దీని వల్ల రవాణా శాఖ ఒక కోటి 12 లక్షల ఆదాయాన్ని కోల్పోయిందని చెప్పారు. ఈ వ్యవహారం మొత్తం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ గుర్తించి, రవాణా శాఖకు వివరాలు పంపగా, జిల్లా రవాణా శాఖ అధికారులు బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారన్నారు. ఎన్ – స్పైరా సంస్థ నిర్వాహకులు పునీత్ పై కేసు నమోదు చేశామన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించారు కాబట్టే ఈ వ్యవహారంలో పోలీసు శాఖ జోక్యం చేసుకుందన్నారు. దీనిపై పలువురు నివాసాల్లో సోదాలు నిర్వహించామని, లెక్కలు లేని ఒక కోటి 81 లక్షల నగదును సీజ్ చేసి ఆదాయపు పన్ను శాఖ అధికారులను అప్పగించామన్నారు. దీనిపై దర్యాప్తు చేయాల్సి ఉందని ఎస్పీ తెలియజేశారు. జిల్లా రవాణా శాఖ అధికారి చందర్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో చోటు చేసుకున్న అవకతవకలపై నాారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ, ఎన్ – స్పైరా సంస్థలకు నోటీసులు జారీ చేసి వివరణ కోరతామని, వివరణ సరిగా లేకపోతే తదుపరి చర్యల్లో భాగంగా ఆ వాహనాలను సీజ్ చేస్తామన్నారు.

Read Previous

నారాయణ మద్దతుదారుల నివాసాల్లో పోలీసుల తనిఖీలు : కోటి 81 లక్షల సీజ్

Read Next

నెల్లూరు రూరల్ లో జనసేన ప్రచారం : కోటంరెడ్డిని గెలిపించాలని విన్నపం

Leave a Reply

Your email address will not be published.