Clock Of Nellore ( Nellore ) – చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నెల్లూరులో చేపట్టిన శాంతియుత ర్యాలీ విజయవంతంగా జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. జనసేన, సిపిఐ పార్టీ నేతలు కూడా హాజరయ్యారు. టిడిపి ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని, ర్యాలీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించినప్పటికీ ఎవ్వరూ లెక్కచేయలేదు. నెల్లూరులో అనేక మంది నేతలను గృహనిర్భంధం చేశారు. జిల్లా వ్యాప్తంగా కూడా టిడిపి నేతలను నెల్లూరుకు వెళ్లనీయకుండా నిర్భంధించారు. అయినప్పటికీ పోలీసుల ఆంక్షలను నేతలు, కార్యకర్తలు లెక్కచేయలేదు. పోలీసుల కళ్లుగప్పి అజ్ఞాతంలోకి వెళ్లిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బుధవారం సాయంత్రం అందిరికంటే ముందుగా ఆటోలో ప్రయాణీకుని మాదిరిగా వచ్చి విఆర్సీ సెంటర్ కు చేరుకున్నారు. తర్వాత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కూడా పోలీసుల కళ్లుగప్పి మోటార్ సైకిల్ లో అక్కడకు చేరుకున్నారు. చీమల గుంపు మాదిరిగా కార్యకర్తలు భారీగా విఆర్సీ సెంటర్ లో గుమిగూడారు. నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామ నారాయణ రెడ్డి, పాశం సునీల్ కుమార్, జనసేన జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి, సిపిఐ నేతలు కూడా విఆర్సీ సెంటర్ కు చేరుకున్నారు. అంచనాలకు మించి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో పోలీసులు చేసేదేమీ లేక అక్కడి నుండి వెళ్లిపోయారు. తర్వాత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నేతలు, కార్యకర్తలు విఆర్సీ సెంటర్ నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకూ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీబొమ్మ సెంటర్ లో ప్రసంగించారు.
ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీద రవిచంద్ర, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. 9 లేదా 10వ తేదీల్లో చంద్రబాబు బయటకు వస్తున్నారన్నారు. దమ్ముంటే టిడిపి ప్రభంజనాన్ని జగన్మోహన్ రెడ్ది అడ్డుకొని చూడాలని సవాల్ విసిరారు. ఈ రాష్ట్రానికి పట్టిన పీడను వదిలించుకునేందుకు రాష్ట్ర ప్రజలు రెడీగా ఉన్నారని, పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా స్వాతంత్ర ఉద్యమాన్ని తలపించేలా కార్యకర్తలు తరలివచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యేలు కంభం విజయరామిరెడ్డి, పరసా రత్నం, నెలవల సుబ్రహ్మణ్యం, పాశం సునీల్ కుమార్, కురుగొండ్ల రామకృష్ణ, అధికార ప్రతినిధి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ చెంచలబాబుయాదవ్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు తిరుమలనాయుడు, జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, నగరాధ్యక్షుడు సుజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
