Clock Of Nellore ( Nellore ) – చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ నెల్లూరుజిల్లా వ్యాప్తంగా 3వ రోజు కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఈ కార్యక్రమాలను నిర్వహించారు. చంద్రబాబు జైలు నుండి విడుదలయ్యే వరకూ నిరసనలు కొనసాగుతాయని నేతలు స్పష్టం చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మూడో రోజు నిరసన జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ, నేతలు కిలారి వెంకటస్వామి నాయుడు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు. నిరాహార దీక్షలో భాగంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మహిళలతో కలిసి నిరసన జ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. చంద్రబాబుకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే ముఖ్యమంత్రి జగన్ అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టు విషయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు అద్భుతమని ఎమ్మెల్యే కోటంరెడ్డి కొనియాడారు. మరో వైపు తెలుగు మహిళలు కూడా నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయం ఎదుట నిరహార దీక్షలు చేపట్టారు. మనుబోలులో సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షల్లో శుక్రవారం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు.
