Clock Of Nellore ( Kavali ) – నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో రాజకీయ పార్టీల ఫ్లెక్సీల రగడ ఉద్రిక్తంగా మారింది. గత కొద్ది రోజులుగా పట్టణంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఫ్లెక్సీలను తొలగిస్తూ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ కమిషనర్ పై నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కేవలం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఫ్లెక్సీలు తప్పా ఇంకే ఫ్లెక్సీ ఉండకూడదన్న లక్ష్యంతో కమిషనర్ పనిచేస్తున్నారని మండిపడుతున్నారు. రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు పుట్టిన రోజును పురస్కరించుకుని టిడిపి నేతలు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పట్టణంలో పలు చోట్ల ఫ్లెక్సీలు కట్టించారు. ఈ నేపద్యంలో గురువారం అర్ధరాత్రి మున్సిపల్ కమిషనర్ సిబ్బంది చేత ఆ ఫ్లెక్సీలకు తొలగింపజేశారు. విషయాన్ని గ్రహించిన టిడిపి నేతలు అక్కడకు చేరుకుని కమిషనర్ ను ప్రశ్నించారు. తొలగిస్తే అన్నీ రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు తొలగించాలని, కేవలం తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలే ఎలా తొలగిస్తారని అడ్డుకున్నారు. దీంతో కమిషనర్ అక్కడి నుండి వెళ్లిపోయారు. తాజాగా శుక్రవారం ఉదయం కమిషనర్ స్వయంగా రోడ్లపైకి వచ్చి మళ్లీ టిడిపి ఫ్లెక్సీలను తొలగింపజేశారు. మరో సారి అక్కడకు చేరుకున్న టిడిపి నేతలు కమిషనర్ ప్రశ్నించినా ఫలితం లేదు. అడ్డుకుంటే కేసులు నమోదుచేయిస్తామని కమిషనర్ హెచ్చరించారు. ఓ ఫ్లెక్సీ వద్దకు వెళ్లి తొలగించే ప్రయత్నం చేయగా టిడిపి నేత, మాజీ కౌన్సిలర్ కుందుర్తి కిరణ్ కత్తిని గొంతుపై పెట్టుకుని ఫ్లెక్సీపై చెయ్యి వేస్తే గొంతు కోసుకుంటానని హెచ్చరించారు. దీంతో కమిషనర్, సిబ్బంది అక్కడి నుండి వెళ్లిపోయారు. అనంతరం టిడిపి నేతలు మాట్లాడుతూ వైసీపి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి తొత్తుగా కమిషనర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తొలగిస్తే అన్నీ ఫ్లెక్సీలు తొలగించాలని, కేవలం టిడిపి ఫ్లెక్సీలే తొలగించడం ఏంటని ప్రశ్నించారు. కమిషనర్ తీరును తీవ్రస్థాయిలో విమర్శించారు.

Reporter – M. Ramanaiah