ఆదిత్య – L1 ప్రయోగం విజయవంతం : కొద్దిసేపు టెన్షన్ పెట్టిన వాహక నౌక

Clock Of Nellore ( Srihari Kota ) – ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆదిత్య – L1 ప్రయోగం విజయవంతం అయ్యింది. నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్ థవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి ఇస్రో శనివారం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఉదయం 11:50 గంటలకు షార్ లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి PSLV – C57 రాకెట్ ఆదిత్య – L1 ఉపగ్రహాన్ని నిప్పులు చిమ్ముతూ నింగిలోకి మోసుకెళ్లింది. వివిధ దశల్లో ప్రయాణించిన రాకెట్ నిర్ధేశిత కక్ష్యలో ఆదిత్య – L1 ను ఉంచినట్లు ఇస్రో ఛైర్మైన్ సోమనాథ్ వెల్లడించారు.

కాసేపు టెన్షన్ పెట్టిన PSLV – C57 !
అనుకున్న సమయానికి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ప్రవేశించిన PSLV – C57 రాకెట్ కొద్ది సేపు శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేసింది. ప్రయోగించిన 582.2 సెకన్లకు మూడో దశ పూర్తయ్యి నాలుగో దశ ప్రయాణం మొదలు కావల్సి ఉండగా ఆ సమయంలో రాకెట్ లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలిసింది. రాకెట్ నిర్ధేశించిన గమనానికి భిన్నంగా ప్రయాణిస్తున్నట్లు ఫ్లైట్ పారామీటర్ లో శాస్త్రవేత్తలు గుర్తించారు. అదే సమయంలో రాకెట్ కు షార్ లోని ట్రాకింగ్ రాడార్ కు మధ్య సిగ్నలింగ్ వ్యవస్థ నిలిచిపోయింది. వెంటనే అప్రమత్తమయిన శాస్త్రవేత్తలు రాకెట్ ఆటోమేటిక్ ప్రోగ్రాంను అప్ డేట్ చేశారు. సుమారు 205 సెకన్ల పాటూ సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రోగ్రాం అప్ డేస్ తర్వాత సిగ్నలింగ్ వ్యవస్థ పునరుద్ధరణ అయింది. అనంతరం రాకెట్ లోని నాలుగో దశ ప్రయాణం మొదలైంది. తర్వాత రాకెట్ నాలుగో దశ నుండి ఆదిత్య – L1 ఉప గ్రహం విడిపోయింది. అయితే ఈ సాంకేతిక సమస్యల విషయాలను ఇస్రో అధికారికంగా వెల్లడించలేదు.

నాలుగు నెలల ప్రయాణం !
ఆదిత్య – L1 ఉపగ్రహం నాలుగు నెలల పాటూ ప్రయాణించి భూమి నుంచి సూర్యుడి దిశగా ఉన్న L1 ( లగ్రాంజ్ పాయింట్ ) వద్దకు చేరుకుంటుంది. 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రదేశంలోకి భారత్ ఉపగ్రహ ప్రయోగం చేపట్టడం ఇదే మొదటి సారి. ఈ ప్రదేశం నుంచి ఆదిత్య – L1 ఎలాంటి అవరోధాలు లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేస్తుంది. ఇందులో 7 పరిశోధన పరికరాలు ఉన్నాయి. అవి సూర్యుడి పొరలైన ఫోటో స్పియర్, క్రోమో స్పియర్ సహా వెలుపలు ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణం గురించి ఎన్నో అంశాలను శోధిస్తాయి. వీటి వల్ల సౌర తుఫానుల నుంచి అంతరిక్షంలోని ఉప గ్రహాలను కాపాడుకోవడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Reporter – Gopinath .K

Read Previous

నెల్లూరుజిల్లాలో ఘనంగా వైఎస్ వర్ధంతి వేడుకలు

Read Next

లక్షిత తల్లిదండ్రులకు టిటిడి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లింపు

Leave a Reply

Your email address will not be published.