అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయండి : కమిషనర్ ఆదేశం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో జనాభాకు తగ్గట్టుగా యువతను ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఎన్నికల సిబ్బందికి కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్ సూచించారు. ఎన్నికల అధికారులు, సూపర్ వైజర్లు, బూత్ లెవెల్ అధికారులతో కార్పొరేషన్ కార్యాలయంలోని ఏ.పి.జె అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో రెండు సెషన్లలో సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అర్హులైన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఓటర్ల జాబితా రూపొందించడంలో బి.ఎల్.ఓ లు తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ పరిధిలోని ఇండ్లను ఇంటింటి సర్వే కచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని ఓటర్లు – జనాభా నిష్పత్తి, లింగ నిష్పత్తి, కొత్త ఓటర్ల నమోదు పాటిస్తూ వివిధ క్లయిముల పరిష్కారంపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఓటర్లు – జనాభా నిష్పత్తిలో ఉన్న తేడాను తగ్గించేందుకు, ఇంటింటి సర్వే కార్యక్రమం ద్వారా ఓటర్ల నమోదుకు ప్రజలను చైతన్య పరిచి, 18 సంవత్సరాలు దాటిన అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని కమిషనర్ సూచించారు. జనాభాకు తగ్గట్టుగా ఓటర్ల నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలలో నిష్పత్తిని సమం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.

సమావేశానికి హాజరు కాని బి.ఎల్.ఓ లకు షో కాజ్ నోటీసులు జారీ చేసి 3 రోజుల్లో వివరణ తీసుకోవాలని ఆదేశించారు. ఇంటింటి సర్వేలో కొంతమంది బి.ఎల్.ఓ లు ఉత్తమ ప్రతిభ కనబరిచి ఓటర్ల నమోదును వేగవంతం చేశారని, అలాంటి వారిని ఇతరులు ఆదర్శంగా తీసుకోవాలని కమిషనర్ సూచించారు. కార్యాలయానికి పంపించే తొలగింపు జాబితాలో సరియైన రిమార్క్స్ తో పాటు తప్పనిసరిగా సాక్షి సంతకాన్ని కూడా జతపరచాలని సూచించారు. మాన్యువల్ గా సమర్పించే ఫారంలకు తగిన రసీదులను ఓటర్లకు అందించాలని చెప్పారు. చేర్పులు, తొలగింపులకు రాజకీయ పార్టీల బి.ఎల్.ఎల్ లను సమన్వయం చేసుకుని జాబితాలో ఎలాంటి తప్పిదాలు లేకుండా సరిచూసుకోవాలని కమిషనర్ సూచించారు. ఫారం 6 ద్వారా 18 నుంచి 21 సంవత్సరాల వయసు వారి వరకు ఓటర్లుగా నమోదు చేయాలని, 21 సంవత్సరాల వయసు దాటిన ఓటర్లను నమోదు చేసేందుకు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, మరేదైనా ప్రాంతంలో వారి ఓటు నమోదు ఉందా అని సరి పోల్చుకోవాలని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల వారీగా వివరాలను సేకరించి 80 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు, దివ్యాంగులు, 18 సంవత్సరాల నిండిన యువతీ యువకులందరినీ ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. రాబోయే 3 నెలల కాలంలో 18 సంవత్సరాలు నిండి ఓటర్ గా అర్హులు కాబోయే వారి వివరాలను సేకరించి, జాబితాలో నమోదు చేయాలని, ఒక డోర్ నెంబరుపై ఎక్కువమంది ఓటర్లు నమోదు అయి ఉంటే పూర్తి స్థాయిలో విచారించి, సరియైన వివరాలను మాత్రమే నమోదు చేయాలని కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో ఏ.ఈ.ఆర్.ఓలు నిర్మలానంద బాబా, దేవీ కుమారి, దశయ్య, ధనుంజయులు, శ్రీనివాసులు, ఈ.డి.టి, సూపర్ వైజర్లు, బూత్ లెవెల్ అధికారులు, ఎలక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.

 

Reporter – P. Eswar

Read Previous

చంద్రుడికి అతి దగ్గరగా చంద్రయాన్ : ఈనెల 23న ల్యాండింగ్

Read Next

డివైడర్ల సుందరీకరణ పనులు తనిఖీ చేసిన నెల్లూరు మేయర్ స్రవంతి

Leave a Reply

Your email address will not be published.