రెవెన్యూ వ్యవస్థలో అనేక మార్పులు : ఆత్మకూరులో వెల్లడించిన మంత్రి ధర్మాన

Clock Of Nellore ( Atmakur ) – వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే రెవెన్యూ వ్యవస్థలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గురువారం నెల్లూరుజిల్లా ఆత్మకూరు పట్టణంలో రెవెన్యూ సదస్సు ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ జరగని అనేక కార్యక్రమాలు రెవెన్యూ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే సుమారు వంద ఏళ్లకు పైగా అపరిష్కృతంగా ఉన్న చుక్కల భూముల సమస్యను పరిష్కరించామని, 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు హక్కులు కల్పించామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా సాగులో ఉన్న భూమికి ఆ సాగుదారుడ్నే యజమానిని చేసే కార్యక్రమాన్ని అధికారికంగా చేప‌ట్టామని చెప్పారు. భూమిని ప్రజల వద్దకు చేర్చాలనే, ఆ భూమి వల్ల వారి స్థితిగతులు మారాలనే గొప్ప లక్ష్యంతో ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన అనేక కార్య‌క్ర‌మాల వల‌న ఇవాళ పేదలు, రైతుల గౌరవం పెరిగిందని, ఆర్థిక పరిస్థితి మారిందని, భరోసాగా జీవిస్తున్నారని ఇదంతా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృఢమైన నాయకత్వం, స్థిరమైన ఆలోచనలు, విశాల భావజాలం వ‌ల‌నే సాధ్యం అయిందన్నారు.

ఆత్మకూరులో సుమారు 20 వేల ఎక‌రాలు చుక్కల భూములకు సంబంధించి రైతులకు హక్కులు కలిపిస్తున్నామని, మరో 6 వేల ఎకరాలు కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. పార్టీల‌కు అతీతంగా ప్రాంతాల‌కు అతీతంగా సంక్షేమాన్ని అందిస్తున్నామని, కుల‌, మ‌తాల‌కు అతీతంగా ప‌థ‌కాల‌ను వ‌ర్తింప జేస్తున్నామన్నారు. అర్హ‌తే ప్రామాణికంగా ఇన్ని మంచి ప‌నులు చేస్తున్నట్లు చెప్పారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రూ.12 వేల800 కోట్లు వెచ్చించి 32 లక్షల మందికి ఇళ్ళ స్తలాలు ఇచ్చామని చెప్పారు. ఇనాం భూముల య‌జ‌మానులకు కూడా పూర్తి హక్కులు కల్పిస్తున్నామని, ఎలిజిబుల్ రైట్స్ ఇస్తున్నామని, ఆత్మకూరులో కూడా 2700 ఎకరాల భూమి కి ఎలిజిబుల్ రైట్స్ కల్పిస్తున్నామని చెప్పారు. భూ వివాదాలను శాశ్వతంగా పరిశీలించేందుకు వందేళ్ళ అనంతరం భూముల రీసర్వేకు 1500 కోట్లతో శ్రీకారం చుట్టామని, ఆధునిక యంత్ర ప‌రిక‌రాల‌తో పూర్తి స్థాయిలో నిష్పాక్షిక ధోర‌ణిలో స‌ర్వే చేస్తున్నామన్నారు. ఈ స‌ర్వే దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని, మనం చేపడుతున్న సర్వేని కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో కూడా చేపట్టాలని సూచించినట్లు చెప్పారు. ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా హద్దు రాళ్ళు వేసి,డాక్యుమెంట్లు ఇస్తున్నామన్నారు. డబల్ రిజిస్ట్రేషన్లు జరగకుండా రిజిస్ట్రేషన్ చట్టంలో కూడా మార్పు తీసుకువచ్చామని, దీంతో రిజిస్ట్రేషన్ అయిన వెటనే మ్యుటేష‌న్ అయ్యేలా సాఫ్ట్వేర్ ను రూపొందిస్తున్నామన్నారు. ప్రతి సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులు బాటు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ తదితరులు పాల్గొన్నారు.

Read Previous

TTD ఛైర్మైన్ గా బాధ్యతలు స్వీకరించిన భూమన కరుణాకర్ రెడ్డి

Read Next

చెన్నైలో కాలి బూడిదైన నెల్లూరు ఆర్టీసీ బస్సు

Leave a Reply

Your email address will not be published.