జగనన్న సురక్షలో మనమే స్టేట్ ఫస్ట్ : వెల్లడించిన కలెక్టర్ హరి నారాయణన్

Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నెల్లూరుజిల్లాలో 5 వారాల పాటు నిర్వహించి 769 సచివాలయాల పరిధిలో ప్రజలకు అవసరమైన 5,77,374 సేవలను పరిష్కరించి ధృవీకరణ పత్రాలను ఉచితంగా అందజేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ తెలిపారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సచివాలయ వ్యవస్థ ద్వారా అందిస్తున్న సర్వీసులను ప్రతి గడప వద్దకు తీసుకెళ్ళడం, అలాగే నవరత్నాల కార్యక్రమం క్రింద అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను అర్హులైన ప్రతి లబ్దిదారునికి అందాలన్న ఏకైక లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 2023, జున్ 24 వ తేదీ నుండి జులై 31 వ తేదీ వరకు 5 వారాల పాటు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. అందులో బాగంగా జిల్లాలోని 769 సచివాలయాలు మరియు 13,744 క్లస్టర్ల పరిధిలోని వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, మండల అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవసరమైన 5,85,323 సర్వీసెస్ లను నమోదు చేసుకొని 5,77,374 సర్వీసెస్ లను పరిష్కరించడం జరిగిందన్నారు. సరైన ఆధారాలు లేనందున 6,415 సర్వీసెస్ లను తిరస్కరించగా, మిగిలిన 1,534 సర్వీసెస్ ఎస్.ఎల్.ఏ పిరియడ్లో వున్నాయని కలెక్టర్ వివరించారు. సర్వీసెస్ పరిష్కారంలో 98.78 శాతం మేర లక్ష్యం సాధించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని మొత్తం 8,37,465 కుటుంబాలకు గాను జగనన్న సురక్ష కార్యక్రమంలో 7,31,108 కుటుంబాలను కవర్ చేయడం జరిగిందన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన క్యాంపుల్లో 2,55,482 మంది ప్రజలు పాల్గొనడం జరిగిందని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అందచేసిన ఉచిత సేవల వలన సుమారు 2.97 కోట్ల రూపాయల ఆర్ధిక పరమైన ప్రయోజనం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుసంధానం చేయగా ప్రజల వద్ద నుండి ఈ కెవైసి కొరకు 4,942 అర్జీలు రాగా, అందులో 4,322 అర్జీలు పరిష్కరించినట్లు కలెక్టర్ తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమ అమలులో నాణ్యతతో దృవీకరణ పత్రాల జారీలో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలోను, సేవలందించడంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా రెండవ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ వివరించారు.

జిల్లాలో జూన్ 24 వ తేదీ నుండి జులై 31 వ తేదీ వరకు 5 వారాల పాటు నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో గ్రామ స్థాయిలో వాలంటీర్ నుండి జిల్లా స్థాయి వరకు సంబంధిత శాఖల అధికారులు కష్టపడి పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. కోవూరు మండల పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నాణ్యతతో నిర్వహించినందుకు తహసిల్దార్ పద్మజ, మండల అభివృద్ధి అధికారి శ్రీహరి, ఈఓపిఅర్ది ఆదినారాయణ, డిప్యూటి తహసిల్దార్ ఇలియాజ్ లను జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ అభినందించి, ప్రశంసాపత్రాలను అందచేసారు. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు పరిచినందుకు కృషి చేసిన డిఆర్డీఏ పిడి సాంబశివారెడ్డిని, అలాగే జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమలుని పటిష్టంగా నిర్వహించిన జిల్లా పరిషత్ సి.ఈ.ఓ చిరంజీవిని, వారి సిబ్బందిని అభినందించి ప్రశంసాపత్రాలను అందచేసారు. పాత్రికేయుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్. కూర్మనాథ్, నెల్లూరు నగరపాలక సంస్థ కమీషనర్ వికాస్ మర్మత్, డి.ఆర్.డి.ఏ పిడి సాంబశివా రెడ్డి, జిల్లా పరిషత్ సి.ఈ.ఓ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Read Previous

ఈనెల 5న నెల్లూరులో చంద్రబాబు పర్యటన : వివిధ వర్గాల వారితో సమావేశం

Read Next

ఇంటి వద్దకే పౌష్ఠికాహారం : సంపూర్ణ పోషణ ప్రారంభించిన జేసి కూర్మనాథ్

Leave a Reply

Your email address will not be published.