Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ గా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియమితులైనారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీ ఏపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆయన్ను నియమిస్తూ పార్టీ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. వైసీపి రూరల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొద్ది నెలల క్రితం వివిధ కారణాలతో పార్టీపై విభేదించి బయటకు వచ్చారు. అదే క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఆదేశాలను పాటించలేదంటూ వైసీపి నుండి కోటంరెడ్డిని సస్పెండ్ చేశారు. తర్వాత ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేశారు. లోకేష్ పాదయాత్రను ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి రూరల్ నియోజకవర్గంలో దగ్గరుండి విజయవంతం చేశారు. దీంతో ఆయన టిడిపిలో చేరిక ఖాయమైంది. అప్పటి నుండి తెలుగుదేశం పార్టీ క్యాడర్ తో కలిసి పనిచేస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి… గత వారం నుండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ టిడిపి బలో పేతానికి కృషి చేస్తున్నారు. ఇదే తరుణంలో మంగళవారం రాత్రి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని రూరల్ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ గా నియమిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. రూరల్ నియోజకవర్గం నుండి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేయనున్నారు.